తెలంగాణ

telangana

ETV Bharat / state

బిల్లుల వసూలుకు జలమండలి కీలక నిర్ణయం.. వారి నల్లా కనెక్షన్‌ కట్‌! - నీటి బిల్లు కట్టకపోతే నల్లా కనెక్షన్ కట్

మీరు నీటి బిల్లులు కట్టలేదా?.. అయితే వెంటనే చెల్లించండి. లేదంటే జలమండలి సిబ్బంది మీ ఇంటికొచ్చి నల్లా కనెక్షన్లు తొలగిస్తారు. బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోవడంతో వాటిని వసూలు చేయడానికి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు జలమండలి ఎండీ దానకిశోర్‌ తెలిపారు.

జలమండలి
జలమండలి

By

Published : Sep 3, 2022, 1:24 PM IST

హైదరాబాద్​లో నీటి బిల్లులు చెల్లించని వారిపై జలమండలి చర్యలు తీసుకోనుంది. ఇందులో భాగంగా జలమండలి ఎండీ దానకిశోర్‌ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రెండు నెలల పాటు ఇంటింటికి వెళ్లి.. నీటి బకాయిలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని, ఒక్కో సబ్‌ డివిజన్‌కు ఐదుగురు చొప్పున తాత్కాలికంగా 200 మంది మీటర్‌ రీడర్లను నియమించాలని సూచించారు.

ఉచితం.. అనుచితం: ప్రభుత్వం అందిస్తున్న నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీటి పథకానికి అర్హులు కాని వారు, ఉచిత నీటి పథకానికి నమోదు చేసుకోని వారి నుంచి.. నల్లా బిల్లులను బకాయిలను వసూలు చేయాలని ఎండీ దానకిశోర్‌ చెప్పారు. గృహ వినియోగ, వ్యాపార కనెక్షన్లు, మురుగునీటి కనెక్షన్లు ఉన్న వారు చెల్లించాల్సిన బకాయిల జాబితా సిద్ధంగా ఉందని తెలిపారు. నీటి బిల్లులు చెల్లించని వారి నల్లాను తొలగించేందుకు డిస్‌కనెక్షన్‌ బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. నెలకు 20వేల లీటర్ల నీటిని వినియోగించుకునే గృహావసరాల వినియోగదారులు ఇప్పటికీ చాలామంది ఉచిత తాగునీటి పథకానికి దరఖాస్తు చేసుకోలేదన్నారు. వీరిలో ఎక్కువ మంది నల్లా బిల్లులు చెల్లించడం లేదని చెప్పారు.

ఆదాయం.. భారీ అంతరం:ఉచిత తాగునీటి పథకాన్ని పొందని వారు ప్రతి నెల రూ.22 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. రూ.7 కోట్లు మాత్రమే చెల్లిస్తున్నారని జలమండలి ఎండీ దానకిశోర్‌ తెలిపారు. తొలుత బకాయిలు చెల్లించాల్సిందిగా వినియోగదారులకు నోటీసులిచ్చి కొంత గడువిస్తామని, అంతలోపు చెల్లించకపోతే మాత్రం కనెక్షన్లను తొలగించనున్నట్లు స్పష్టం చేశారు. ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా మొత్తం రూ.100 కోట్ల బకాయిలు వసూళ్లను లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ సమావేశంలో జలమండలి రెవెన్యూ డైరెక్టర్‌ వీఎల్‌ ప్రవీణ్‌ కుమార్‌, ఆపరేషన్స్‌ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, స్వామి, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:ఆ అధికారి.. సైంధవ పాత్రధారి

దేశంలో పెరిగిన కొవిడ్ కేసులు.. 33 మంది మృతి.. జపాన్​లో ఆగని విలయం

ABOUT THE AUTHOR

...view details