తెలంగాణ

telangana

ETV Bharat / state

'వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఎకరాల్లో నూనె గింజల సాగే లక్ష్యం' - మంత్రి కేటీఆర్‌

రైతులను వరికి ప్రత్యామ్నాయంగా నూనె గింజల సాగు వైపు మొగ్గు చూపే విధంగా చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని మాదాపూర్ నాలెడ్జ్‌ సిటీ రోడ్‌ ఐటీసీ కోహెనూర్‌లో ఐవీపీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన వెజ్ ఆయిల్, ఆయిల్‌ సీడ్ రంగంపై గ్లోబల్ రౌండ్‌ టేబుల్-2022 సదస్సును నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతినిధులు, మంత్రులు పాల్గొన్నారు.

IVPA GLOBAL ROUNDTABLE  SUMMIT 2022
మంత్రి కేటీఆర్‌

By

Published : Nov 18, 2022, 7:17 PM IST

ఐదేళ్లలో 20లక్షల ఎకరాల్లో నూనె గింజల సాగే లక్ష్యం

వరికి ప్రత్యామ్నాయంగా రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఎకరాల విస్తీర్ణంలో నూనె గింజల సాగు వైపు రైతులను మళ్లించటమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. హైదరాబాద్‌లోని మాదాపూర్ నాలెడ్జ్‌ సిటీ రోడ్‌ ఐటీసీ కోహెనూర్‌లో ఐ.వీ.పీ.ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన వెజ్ ఆయిల్, ఆయిల్‌ సీడ్ రంగంపై గ్లోబల్ రౌండ్‌ టేబుల్-2022 సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొనగా.. మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

వంట నూనెల రంగంలో సుస్థిర, స్వయం సమృద్ధి, ధరలు, మార్కెటింగ్ వంటి అంశాలపై ఈ సందర్భంగా విస్తృతంగా చర్చించారు. పామాయిల్, వేరుశనగ, సోయాబీన్, పొద్దు తిరుగుడు లాంటి పంటల సాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. రైతులను వరికి ప్రత్యామ్నాయంగా నూనె గింజల సాగు వైపు మొగ్గు చూపే విధంగా చేస్తున్నామని.. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో సోయాబీన్‌ సాగు ఎక్కువగా జరుగుతోందన్నారు. వనపర్తి, గద్వాల్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, నారాయణపేట్‌ జిల్లాల్లో అధికంగా వేరుశనగను పండిస్తున్నారని వివరించారు. ఆగ్రో సంస్థలు, ప్రతినిధులు ఈ అవకాశాలను చూసి తెలంగాణ వైపు మొగ్గు చూపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పిస్తున్న ఆహార శుద్ధి పరిశ్రమలు స్థాపనకు ముందుకు రావాలని ఐటీ మంత్రి ప్రతినిధులను కోరారు.

ఆగ్రో, ఆహారశుద్ధి సంస్థల ముఖ్య అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆహారశుద్ధి పరిశ్రమ ప్రారంభించాలనుకునే వారికి చెబుతున్నా.. తెలంగాణ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ కోసం రాష్ట్రంలో 10వేల ఎకరాల భూమి కేటాయించాం. ఫ్యాక్టరీలు పెట్టేవారితో పని చేసేందుకు సంతోషంగా సిద్ధంగా ఉన్నాం. వచ్చే ఐదేళ్లలో వ్యవసాయమంత్రి నేతృత్వంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ఫాం సాగు చేస్తాం. వేరుశనగ, పొద్దు తిరుగుడు, సోయాబీన్‌ పంటల సాగు విస్తీర్ణంలో వృద్ధిని మీరు గమనించబోతున్నారు. మీరు ఫ్యాక్టరీ పెడితే.. మీకు ముడిసరుకు కోసం ఇబ్బంది ఉండదు. ప్రత్యేక ఆహారశుద్ధి జోన్లలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అక్కడ మీకు ప్రత్యేక రాయితీలు ఉంటాయి. దేశంలోనే మీకు ఇంత మంచి అవకాశం ఉండదు.- కేటీఆర్‌, పరిశ్రమల శాఖ మంత్రి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details