మెడికల్ పీజీ ఇన్-సర్వీస్ అభ్యర్థుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. త్వరలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. హైదరాబాద్ కోఠిలోని వైద్యారోగ్యశాఖ సంచాలక భవనంలో వివిధ జిల్లాల్లోని గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లతో ఆయన భేటీ అయ్యారు. సర్వీస్ కోటా, పదోన్నతులు, వాహన భత్యం, ప్రోటోకాల్ సమస్య తదితర అంశాలపై వైద్యులు మంత్రికి విన్నవించారు.
ఇన్-సర్వీస్ అంశంపై.. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితిని నివేదించాలని అధికారులను ఆదేశించినట్లు ఈటల వెల్లడించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను అనుసంధానం చేయడానికి గతంలో ప్రయత్నాలు చేసినప్పటికీ.. కొవిడ్ వల్ల పరిస్థితులు మారిపోయాయని గుర్తు చేశారు.