హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి వచ్చే ఓపీ రోగుల్లో కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించేందుకు మిలీనియం బ్లాక్‌లో ప్రత్యేకంగా తాత్కాలిక స్క్రీనింగ్ కౌంటర్ ఏర్పాటు చేశారు. ముందుగా థర్మో స్క్రీనింగ్, బీపీ పరీక్షలు నిర్వహించి.. ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే వైద్య పరీక్షలకు అనుమతిస్తున్నారు.
నిమ్స్‌లో ఓపీకి మూడు రోజులు..! - ఓపీ సేవలు
మెరుగైన వైద్యం కోసం నిమ్స్ ఆసుపత్రికి వచ్చే రోగులకు పరీక్షల కోసం రెండు నుంచి మూడు రోజుల సమయం పడుతోంది. ఆసుపత్రిలో వైద్య సేవలకు ముందు కరోనా స్క్రీనింగ్ తప్పనిసరి చేశారు. ఇందుకు ఒకటే కౌంటర్ ఏర్పాటు చేయడం వల్ల తీవ్ర జాప్యం జరుగుతోంది. ఓపీ పరీక్షల కోసం 500 మందికి పైగా వచ్చినా.. 200 మందిని పరీక్షించే సరికే సమయం మించిపోతుంది.
అనంతరం వారు ఆయా విభాగాలకు వెళ్లి వైద్యులను కలిసే సరికే మధ్యాహ్నం అవుతోంది. ఆ సమయంలో వైద్యులు లేక మరుసటి రోజు రావాల్సి వస్తోంది. ఆసుపత్రికి నగరంతోపాటు మెదక్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి వస్తుంటారు.
సకాలంలో వైద్య పరీక్షలు పూర్తి కాకపోవడం వల్ల నిరాశతో వెనుతిరిగిపోతున్నారు. లాక్‌డౌన్‌తో హోటళ్లు, లాడ్జీల్లో ఉండేందుకూ అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ప్రజలకు సత్వర సేవలందేలా స్క్రీనింగ్ కౌంటర్లను పెంచడంతోపాటు ఓపీ సమయాన్ని కూడా పెంచాలని రోగులు, వారి సహాయకులు కోరుతున్నారు.