పోలవరం ప్రాజెక్టు అంచనాకు కేంద్ర ఆర్థిక శాఖ మళ్లీ కొర్రీ పెట్టినట్లు తెలిసింది. 2017-18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయానికి అంగీకరించకుండా 2013-14 ధరల ప్రకారం అయ్యే వ్యయాన్ని చెల్లిస్తామని.. ఇందులో కూడా తాగునీటి సరఫరా, విద్యుత్తు బ్లాక్ నిర్మాణానికి అయ్యే ఖర్చునూ మినహాయిస్తామని పేర్కొన్నట్లు తెలిసింది. దీనిపై అభిప్రాయం చెప్పాలని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖను తాజాగా కోరినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. తాజాగా ఆర్థిక శాఖ చేసిన ప్రతిపాదన ప్రకారం అయితే కేంద్రం ఇచ్చేది సగానికిపైగా తగ్గిపోతుంది. 2014కు ముందు చేసిన ఖర్చు, ఆ తర్వాత ఇప్పటివరకు కేంద్రం నుంచి వచ్చింది పోనూ రూ.అయిదారు వేల కోట్లకు మించి వచ్చే అవకాశం లేదు. ఆర్థిక శాఖ నుంచి కేంద్ర జల్‌శక్తి శాఖకు ఇలాంటి ప్రతిపాదన వచ్చినట్లు తెలిసిందని.. తమకు గానీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి గానీ అధికారికంగా ఇంకా ఎలాంటి సమాచారం లేదని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ వర్గాలు తెలిపాయి.
రూ.47,725 కోట్లకు ఆమోదం కోసం పంపితే..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 2010-11వ ఆర్థిక సంవత్సరం అంచనాల ప్రకారం 16010.45 కోట్లు వ్యయమవుతుందని మొదట అంచనా వేశారు. 2014లో ఈ ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా కల్పించింది. నిర్మాణంలో జాప్యం జరగడంతో మళ్లీ అంచనాలు సవరించారు. 2013-14 ధరల ప్రకారం రూ.30,718.95 కోట్లుగా జలసంఘం నిర్ణయించింది. ఆర్థికశాఖ నియమించిన కమిటీ ఈ అంచనాలను పరిశీలించి 29,027.95 కోట్లకు తగ్గించింది. తర్వాత 2017-18 ధరల ప్రకారం అంచనాలను తయారు చేశారు. కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా కమిటీ రూ.55656.87 కోట్లుగా నిర్ణయించింది. అంచనాల సవరణ కమిటీ దాన్ని రూ.47,725.24 కోట్లకు తగ్గించింది. ఈ మొత్తానికి కేంద్ర జల్‌శక్తి మంత్రి ఆమోదముద్ర వేసి ఆర్థిక శాఖకు పంపారు. ఇదే సమయంలో రూ.2,300 కోట్ల బిల్లుల చెల్లింపునకు సంబంధించిన ఫైలు కూడా జల్‌శక్తి శాఖ నుంచి ఆర్థిక శాఖకు వెళ్లింది.