ఓ వైపు ఎమ్మెల్యే ఎర కేసు.. దిల్లీ మద్యం కుంభకోణం విచారణ వేళ రాష్ట్రంలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. గ్రానైట్ వ్యాపారానికి సంబంధించిన వ్యవహారంలో ఇటీవల మంత్రి గంగుల కమలాకర్ నివాసం, కార్యాలయాల్లో ఈడీ, ఐటీ తనిఖీలు నిర్వహించగా.. తాజాగా మరో మంత్రిపై ఆదాయ పన్నుశాఖ దృష్టి సారించింది. బృందాలుగా ఏర్పడిన ఐటీ అధికారులు.. తెల్లవారుజాము నుంచి మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుపుతున్నారు.
సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో మంత్రి మల్లారెడ్డి నివాసంతో పాటు పక్కనే ఉన్న మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి ఇల్లు.. మల్లారెడ్డి వియ్యంకుడు మర్రి లక్ష్మారెడ్డి నివాసంతో పాటు అదే ప్రాంతంలోని మంత్రి సోదరుడు గోపాల్‌రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలోని మల్లారెడ్డి పెద్దకుమారుడు మహేందర్‌రెడ్డి నివాసంలో, కొంపల్లిలోని చిన్న కుమారుడు భద్రారెడ్డి నివాసంలో ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీతో పాటు కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో అధికారులు సోదాలు జరుపుతున్నారు. సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రి, నారాయణ ఆస్పత్రి, మల్లారెడ్డి వైద్య కళాశాల, మల్లారెడ్డి డెంటల్ కాలేజ్‌లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కుటుంబసభ్యులు, బంధువులతో పాటు మంత్రి మల్లారెడ్డికి చెందిన సంస్థల డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల ఇళ్లలోనూ ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఐటీ తనిఖీల్లో నగదు, కీలక పాత్రాలు స్వాధీనమయ్యాయి. ఐటీ సోదాల్లో దాదాపు 50 బృందాలు పాల్గొన్నారు.