రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డిపై చోరీ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆదాయ పన్నుశాఖ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోయిన్‌పల్లి పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. మరోవైపు.. తప్పుడు నివేదికపై తన సోదరుడితో బలవంతంగా సంతకం చేయించేందుకు ప్రయత్నించారంటూ మంత్రి తనయుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆదాయ పన్ను శాఖ డిప్యూటీ డైరెక్టర్ పైనా కేసు నమోదైంది. ఓ దశలో ఆవేశానికి గురైన మంత్రి.. ఐటీ అధికారి చేయి పట్టుకొని తన కారులోనే ఠాణాకు తీసుకెళ్లడం కలకలం రేపింది. మల్లారెడ్డితో పాటు కుటుంబసభ్యులు, బంధువులకు చెందిన ఇళ్లు, కార్యాలయాలు, సంస్థల్లో ఆదాయపన్ను శాఖ నిర్వహించిన సోదాల్లో ఇలాంటి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
మంగళవారం తెల్లవారుజాము నుంచే సోదాలు ఆరంభం కాగా.. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సినీఫక్కీలో ఈ తరహా హైడ్రామా నెలకొంది. తెల్లవారుజాము వరకు హడావుడి కొనసాగింది. గురువారంతో సోదాలు ముగించిన ఐటీ అధికారులు.. మల్లారెడ్డి సహా 16 మంది విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. బుధవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఐటీ సోదాలు కొనసాగుతుండగానే.. మంత్రి మల్లారెడ్డి ఇంటి నుంచి హడావుడిగా బయటకు వెళ్లారు. గన్‌మెన్ లేకుండానే కారులో బయలుదేరిన ఆయన నేరుగా సూరారంలోని మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రికి చేరుకుని.. చికిత్స పొందుతున్న కుమారుడు మహేందర్‌రెడ్డి వద్దకు వెళ్లారు.
మేనేజ్‌మెంట్ కోటాలో ఇంజినీరింగ్, మెడికల్ సీట్ల డొనేషన్లకు సంబంధించి రూపొందించిన నివేదికలో మహేందర్‌రెడ్డితో ఐటీ అధికారులు బలవంతంగా సంతకాలు చేయిస్తున్నారని తెలియడంతోనే మంత్రి హడావుడిగా వెళ్లారనే ప్రచారం జరిగింది. మహేందర్‌రెడ్డి ఇంట్లో తనిఖీలకు సంబంధించిన పత్రాలపై ఆయనతో సంతకాలు చేయించేందుకు ఆసుపత్రిలో వేచి ఉన్న ఆదాయ పన్నుశాఖ డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్‌కు, మంత్రికి ఈ సందర్భంగా వాగ్వాదం జరిగినట్లు సమాచారం. రత్నాకర్ నుంచి సెల్‌ఫోన్, సెర్చ్ వారంట్, ల్యాప్‌టాప్‌ను మంత్రి లాక్కున్నారని అభియోగం. సోదాలు చేస్తున్న మిగిలిన అధికారుల వద్ద ఈ విషయాన్ని తేల్చుకుందామంటూ మంత్రి రత్నాకర్‌ను తన కారులోనే వెంటబెట్టుకుని బోయిన్‌పల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అప్పటికే ఐటీ అధికారులంతా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఆయన రత్నాకర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా మంత్రి.. రత్నాకర్ చేయి పట్టుకొని ఒకరకంగా బలవంతంగా లాక్కెళ్లిన దృశ్యాలు కనిపించాయి. రాత్రి సుమారు ఒంటిగంట సమయంలో మంత్రి పోలీస్ స్టేషన్‌కు వస్తున్నట్లు బోయిన్‌పల్లి సీఐ రవికుమార్‌కు మంత్రి వ్యక్తిగత కార్యదర్శి ఫోన్ చేశారు. కాసేపటికి మల్లారెడ్డి తన చిన్న కుమారుడు భద్రారెడ్డి, ఐటీ అధికారి రత్నాకర్‌తో కలిసి ఠాణాకు వచ్చారు. ఆదాయ పన్ను దాడులు నకిలీవిగా కనిపిస్తున్నాయని.. అధికారులు దాడి చేయడంతోనే తన సోదరుడు మహేందర్‌రెడ్డి ఆసుపత్రి పాలయ్యారని.. సెర్చ్ ప్రొసీడింగ్స్‌పై ఆయనతో బలవంతంగా సంతకాలు తీసుకునేందుకు ప్రయత్నించారని భద్రారెడ్డి ఫిర్యాదు చేయడంతో ఐటీ అధికారి రత్నాకర్‌పై పోలీసులు ఐపీసీ 384 (దోపిడీ) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
రాత్రి 2 గంటలు.. రంగంలోకి సీఆర్పీఎఫ్ బలగాలు..:పోలీస్‌స్టేషన్ నుంచి మంత్రి తన కారులోనే రత్నాకర్‌ను తీసుకెళ్లారు. రాత్రి 1.50 గంటల సమయంలో రత్నాకర్ మళ్లీ ఒంటరిగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. కాసేపటికే పదుల సంఖ్యలో సీఆర్పీఎఫ్ బలగాలు అక్కడికొచ్చి.. ఠాణాను తమ అధీనంలోకి తీసుకున్నంత పని చేశారు. లోపలికి ఎవరినీ రానీయొద్దంటూ వారు సూచించడంతో బోయిన్‌పల్లి పోలీసులు స్టేషన్ గేటుకు తాళం వేశారు. తర్వాత మంత్రిపై రత్నాకర్ ఫిర్యాదు చేశారు. ‘విధి నిర్వహణలో భాగంగా ఆసుపత్రికి వెళ్లి సెర్చ్ ప్రొసీడింగ్స్ సిద్ధం చేస్తుండగా.. మంత్రి తన అనుచరులతో వచ్చి ఆధారాల్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. నా నుంచి సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, వారంట్లను లాక్కున్నారు. వాటిని చించేసే ప్రయత్నం చేశారు. నా విధుల్ని అడ్డుకున్నారు’ అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు మల్లారెడ్డిపై ఐపీసీ సెక్షన్లు 379 (చోరీ), 342 (బలవంతంగా నిర్బంధించడం), 353 (దాడి), 201 (నేర ఆధారాల్ని మాయం చేయడం), 203 (నేరానికి సంబంధించి తప్పుడు సమాచారం ఇవ్వడం), 504 (ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 506 రెడ్‌విత్ 34 (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు. అదే సమయంలో సీఐకి మంత్రి నుంచి వచ్చినట్లుగా చెబుతున్న ఫోన్‌కాల్‌ను సీఆర్పీఎఫ్ బలగాలు మాట్లాడనీయలేదని సమాచారం.