IT Raids across in Telangana: రాష్ట్రవ్యాప్తంగా మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపాయి. క్రిస్టియన్ మిషనరీలతో పాటు.. పలు సంస్థల్లో అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. ఏకకాలంలో 40 చోట్ల దాడులు నిర్వహిస్తున్నారు. అల్వాల్, పటాన్‌చెరు, కీసర, జీడిమెట్ల, బొల్లారం, సికింద్రాబాద్, మెదక్, వరంగల్ సహా పలు ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి 20 బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు తనిఖీల్లో పాల్గొంటున్నారు.
40 ప్రాంతాల్లో అధికారుల తనిఖీలు: బాలవికాసకు సంబంధించిన క్రిస్టియన్ మిషనరీలతో పాటు పలు సంస్థల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థకు సంబంధించి ఆర్ధిక లావాదేవీలు, పన్ను ఎగవేతకు సంబంధించి పక్కా ఆధారాలతో.. పెద్ద ఎత్తున దాడులు చేపట్టినట్లు సమాచారం. జంటనగరాల్లోని కీసర, ఘట్‌కేసర్, మల్కాజ్‌గిరి సహా 40 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయా అనే కోణంలో:ఈ క్రమంలోనే సికింద్రాబాద్ అల్వాల్‌లోని సాజిజాన్ అనే వ్యక్తి నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.. ఉదయం నుంచి ఆయన నివాసంలో సోదాలు జరుపుతున్నారు. బాలవికాస అనే క్రిస్టియన్ మిషనరీకి.. జాన్ అనే వ్యక్తి కీలకంగా ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే సంస్థకు చెందిన డాక్యుమెంట్లను ఆస్తులను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయా అనే కోణంలో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం ఫాతిమానగర్‌లోని బాలవికాస పీపుల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. సిబ్బంది చరవాణీలను స్వాధీనం చేసుకుని సోదాలు చేశారు.
కొన్నిరోజుల క్రితమే ఐటీ సోదాలు: కాగా కొన్నిరోజుల క్రితం ఐటీ అధికారులు వసుధ ఫార్మా కంపెనీలో సోదాలు చేపట్టారు. ఆ తర్వాత దిల్‌సుఖ్‌నగర్‌లోని గూగి స్థిరాస్తి సంస్థ వండర్ సిటీ, రాయల్ సిటీతో పాటు.. రాష్ట్రంలోని పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో అధికారులు ముమ్మరంగా తనిఖీలు జరిపారు. ఆ వెంటనే పలు షాపింగ్ మాల్స్‌పై దాడులు చేశారు.