తెలంగాణ అస్థిత్వానికి అండగా నిలిచిన మహనీయుల సేవలను స్మరించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు వరుసలో ఉందని.. పీవీ నర్సింహారావు, ఈశ్వరీబాయి, వెంకటస్వామి లాంటి వారిని పార్టీలకతీతంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్మరించుకుంటూ వారి జయంతి కార్యక్రమాలను అధికారికంగా జరిపేలా అదేశాలిచ్చారని తెలిపారు. జయశంకర్ సార్‌తో పాటు, పీవీ, కొండా లక్ష్మణ్, కొమురం భీం వంటి మహనీయుల పేర్లను విశ్వవిద్యాలయాలు, జిల్లాలకు పేర్లు పెట్టి స్మరించుకుంటున్నామని గుర్తు చేశారు.
పీవీకి భారతరత్న ఇవ్వాలి
తెలుగు ప్రజల ఖ్యాతిని ఖండాంతరాలకు తెలిసేలా చేసిన మహనీయుడు పీవీ నర్సింహారావుకు రావాల్సిన పేరు రాలేదన్నారు. పీవీకి భారతరత్న రావాలన్నారు. ఈ విషయంలో ప్రధానిని స్వయంగా కలుస్తానని సీఎం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. స్వాతంత్ర సమరయోధుడిగా, రాజకీయ నాయకునికిగా, ప్రధానిగా అద్భుతమైన సేవలందించిన మహనీయుడి జయంతిని రానున్న ఏడాది పాటు జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రవాసులందరూ ఉత్సవాల్లో పాల్గొనాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.