KTR Mumbai Tour Updates: ముంబయి పర్యటనలో ఉన్న రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్.. పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో సంస్థ కార్పోరేట్ కార్యాలయం బాంబే హౌస్ లో సమావేశమైన మంత్రి... వ్యాపార, వాణిజ్య అవకాశాలపై చర్చించారు. తెలంగాణలో జరుగుతున్న పారిశ్రామికాభివృద్ధి, ప్రభుత్వం అమలు చేస్తున్న అత్యుత్తమ పారిశ్రామిక విధానాలను వివరించిన కేటీఆర్... రాష్ట్రంలో టాటా గ్రూపు కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ఉన్న అవకాశాలను ఆయా రంగాల వారీగా వివరించారు. తెలంగాణలోని వ్యాపార అనుకూల పరిస్థితులు, అవకాశాలను దృష్టిలో ఉంచుకొని టాటా గ్రూపు వివిధ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. టాటా గ్రూపు వివిధ రంగాల్లో చేపట్టనున్న విస్తరణ ప్రణాళికలో తెలంగాణ రాష్ట్రానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
టాటా గ్రూపు ఛైర్మన్ చంద్రశేఖరన్‌తో మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి: ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో హైదరాబాద్ కేంద్రంగా టాటా గ్రూప్ అద్భుతమైన ప్రగతి సాధిస్తుందన్న మంత్రి కేటీఆర్... టీసీఎస్ కార్యకలాపాలను వరంగల్‌కు విస్తరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు. తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని వివరించిన ఆయన... ఈ రంగంలో భారీ ప్రణాళికలతో టాటా గ్రూప్ ముందుకు పోతున్న తరుణంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. విమానయాన రంగంలో టాటా సంస్థ మంచి పురోగతి సాగిస్తున్న నేపథ్యంలో... హైదరాబాద్‌లో ఒక ఎమ్మార్వో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేటీఆర్ కోరారు. తెలంగాణలో వివిధ రంగాల్లో తమ సంస్థ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న కార్యకలాపాలు కొనసాగుతున్న తీరుపై అత్యంత సంతృప్తి వ్యక్తం చేసిన టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్... రాష్ట్రంలో వ్యాపార నిర్వహణ అత్యంత సులువుగా ఉంటుందని తమ సంస్థ అనుభవం నిరూపించిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో టాటా కార్యకలాపాల విస్తరణలో తెలంగాణకు ఖచ్చితంగా కీలకమైన స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తే సహకరిస్తాం : జేఎస్‌డబ్ల్యూ సంస్థ ఎండీ సజ్జన్ జిందాల్‌తో ఆ సంస్థ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన మంత్రి... స్టీల్, సిమెంట్ వంటి రంగాల్లో ఉన్న అపార అనుభవంతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసేందుకు మొదట కేంద్రం ముందుకొచ్చిందని, సెయిల్ కూడా సంసిద్ధత వ్యక్తం చేసిందన్న కేటీఆర్... బయ్యారంతో పాటు పక్కనున్న ఛత్తీస్‌గడ్‌లో ఉన్న ఇనుప ఖనిజం నిల్వలను దృష్టిలో ఉంచుకొని అక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని వివరించారు. జిందాల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ముందుకొస్తే ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందుతాయని హామీ ఇచ్చారు. విద్య, క్రీడలు, తదితర రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని జిందాల్‌ను కేటీఆర్ కోరారు. తెలంగాణ ప్రభుత్వ విధానాల గురించి తమకు అవగాహన ఉందన్న సజ్జన్ జిందాల్... కొన్నేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతి, పెట్టుబడుల విషయంలో సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు.
వంటనూనెల ఉత్పత్తిపై పెట్టుబడులకు ఇదే సరైన సమయం: హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ఎండీ సంజీవ్ మెహతాతో సమావేశమైన మంత్రి కేటీఆర్... తెలంగాణలో ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించారు. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయంతో పాటు అనేక ఇతర ఆర్థిక సూచీలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని... ఆయా రంగాల్లో ప్రజల కొనుగోలు శక్తి పెరిగిన నేపథ్యంలో తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా ఎంచుకునేందుకు ఇదే సరైన అవకాశమని కేటీఆర్ తెలిపారు. పామ్ ఆయిల్ ఉత్పత్తి కోసం బృహత్తర లక్ష్యాన్ని ఎంచుకున్న తెలంగాణ ప్రభుత్వం... ఆ దిశగా రైతులను చైతన్యపరిచి ప్రోత్సహిస్తోందని చెప్పారు. వంటనూనెల ఉత్పత్తి కోసం హిందుస్థాన్ యూనిలీవర్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని మంత్రి పేర్కొన్నారు. ఆర్పీజీ గ్రూప్ ఎండీ అనంత్ గోయంకాతోనూ సమావేశమైన మంత్రి కేటీఆర్... పెట్టుబడులు, రాష్ట్ర ప్రగతిపై చర్చించారు.
ఇవీ చదవండి: