KTR America Tour Today : తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటించనున్నారు. ఇవాళ్టి నుంచి రెండువారాల పాటు.. ఈ పర్యటన కొనసాగుతుందని సమాచారం. అమెరికాలోని ప్రముఖు కంపెనీల ఛైర్మన్లు, సీఈఓలు, ప్రతినిధులతో సమావేశం కానున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలుచేస్తున్న విధానాలను వివరించనున్నారు. తెలంగాణలో పెట్టుబడులపై... కొన్ని కీలక ఒప్పందాలు కూడా జరగనున్నట్లు పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి. ఈ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఇతర అధికారులు కూడా కేటీఆర్ వెంట అమెరికా వెళ్లనున్నారు.
కేటీఆర్ లండన్ పర్యటనతో రాష్ట్రానికి పలు పెట్టుబడులు :ఇటీవల యూకే పర్యటనకు వెళ్లివచ్చిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు రాష్ట్రానికి పలు పెట్టుబడులను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. స్పోర్ట్స్ లైవ్ స్ట్రీమింగ్ దిగ్గజం డాన్జ్ హైదరాబాద్లో ప్రొడక్ట్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఇక్కడ ఏర్పాటు చేసే ఆ కేంద్రంతో 1,000 మందికి ఉపాధి లభిస్తుందని సంస్థ ప్రకటించింది. ఈ మేరకు కేటీఆర్ సమక్షంలో డాన్జ్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదిరింది. బ్రిటన్ ఆధారిత ఇన్‌క్రెడిబుల్ హస్క్ ఇంటర్నేషనల్ గ్రూప్ రూ.200 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో పరిశ్రమ పెట్టేందుకు ముందుకొచ్చింది.