ట్రైబ్యునళ్ల(Tribunals)లో సభ్యులను నియమించకపోవడం న్యాయనిరాకరణే అవుతుందని హైకోర్టు (High Court) వ్యాఖ్యానించింది. ట్రైబ్యునళ్లు లేనప్పడు సివిల్ కోర్టును ఆశ్రయించి న్యాయం పొందేవారని... ఇప్పుడు ట్రైబునళ్లు ఏర్పాటు చేసి అందులో సభ్యులను నియమించకపోవడం న్యాయ నిరాకరణే అవుతుందని... అది న్యాయప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని పేర్కొంది.
జ్యుడీషియల్ సభ్యుడిని నియమించకపోవడాన్ని సవాల్ చేస్తూ రైల్వే క్లెయిమ్స్ ట్రైబ్యునల్ అడ్వొకేట్స్ అసోసియేషన్ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ వినోద్ కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్రం తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... రైల్వే ట్రైబ్యునల్ నియామకాలకు సిఫార్సు చేయాల్సింది న్యాయశాఖ అని... నియామకాలు చేపట్టాల్సింది రైల్వేశాఖ అని వాటిని ప్రతివాదులుగా చేయకుండా కేవలం కేబినెట్ కార్యదర్శిని చేశారన్నారు.
ప్రతివాదులుగా చేరుస్తున్నాం...
స్పందించిన ధర్మాసనం పిటిషన్లు వేసే ముందు సంబంధిత శాఖలను ప్రతివాదులుగా చేర్చకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తిరిగి వారికి ఆదేశాలిచ్చి పిటిషనర్లు ప్రతివాదులుగా చేర్చడం వరకు ఎందుకు వేచిఉండాలని.. సుమోటోగా తామే కేంద్ర న్యాయ, రైల్వే శాఖను ప్రతివాదులుగా చేరుస్తున్నామని తెలిపింది. సివిల్ కోర్టులపై భారం తగ్గించి సత్వర న్యాయం అందించే లక్ష్యంతో చాలా ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేశారని.. ప్రస్తుతం వాటికి సభ్యులను నియమించకపోగా... కొన్నింటిని మూసేస్తున్నారని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఇది న్యాయ నిరాకరణే...
ట్రైబ్యునళ్లు ఉండగా సివిల్ కోర్టులు... కేసులను స్వీకరించట్లేదని అలాగని ట్రైబ్యునళ్లలో సభ్యులు లేక విచారణ జరగడం లేదని తెలిపింది. న్యాయం పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని... దాన్ని నిరాకరించే అధికారం ప్రభుత్వానికి లేదంది. ఇది న్యాయ నిరాకరణే అవుతుందని... ఖాళీలను భర్తీ చేయని పక్షంలో ట్రైబ్యునళ్లు మూసేయాలంటూ... ప్రభుత్వంపై హైకోర్టు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. అక్టోబరు 4లోగా వివరణ ఇవ్వాలని కేంద్ర న్యాయశాఖ, రైల్వే శాఖలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.
ఇదీ చదవండి :PAWAN KALYAN: 'భయమంటే ఎలా ఉంటుందో.. నేను నేర్పిస్తా'