తెలంగాణ

telangana

ETV Bharat / state

FAKE SEEDS: సమగ్ర వివరాలు ముద్రించిన విత్తన ప్యాకెట్లు కొనడమే మేలు - fake seeds news

ఆరుగాలం శ్రమించే రైతన్న విత్తనాలు కొనే సమయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తే సిరులు పండించుకోవచ్చు. లేని పక్షంలో పెట్టుబడులు నష్టపోయి కుటుంబం రోడ్డున పడాల్సి వస్తుంది. విత్తనాలు కొనేటప్పుడు వ్యాపారి నుంచి పక్కా రశీదు తీసుకుని దాన్ని ఆ వ్యవసాయ సీజన్‌ చివరి వరకు భద్రపరుచుకుంటే మేలని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.

సమగ్ర వివరాలు ముద్రించిన విత్తన ప్యాకెట్లు కొనడమే మేలు
సమగ్ర వివరాలు ముద్రించిన విత్తన ప్యాకెట్లు కొనడమే మేలు

By

Published : Jun 14, 2021, 5:18 AM IST

విత్తనాలు అమ్మే అధీకృత లైసెన్సులున్న డీలర్లు, చిల్లర వ్యాపారుల నుంచి మాత్రమే రైతులు విత్తనాలను కొనాలని వ్యవసాయశాఖ అధికారులు అవగాహన పెంపొందిస్తున్నారు. గ్రామాల్లోని చిన్నచిన్న దుకాణాల్లో విత్తన ప్యాకెట్లు అమ్ముతున్న కొందరికి లైసెన్సులు లేవు. అలాంటి వ్యాపారుల వద్ద కొంటే పరిహారం రాదు. విత్తనాలు నాటిన తరవాత పంట సాగు కాలంలో అవి నకిలీ విత్తనాలని తేలితే.. వెంటనే తమ వద్ద ఉన్న రశీదు ఆధారంగా వ్యవసాయాధికారికి సదరు వ్యాపారిపై ఫిర్యాదు చేయాలి. అప్పుడే వ్యాపారి, తయారీ కంపెనీ నుంచి పరిహారం ఇప్పించి వారిని జైలుకు పంపడానికి ఆస్కారం ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు. ప్రతి విత్తన ప్యాకెట్‌ లేదా 30 కిలోల బస్తాపై విత్తనాలకు సంబంధించిన సమస్త వివరాలు వ్యాపారులు ముద్రించాలని, ఆ విత్తనాలనే రైతులు కొనాలని రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్‌, విత్తన శాస్త్రవేత్త డాక్టర్‌ కేశవులు ‘ఈనాడు’కు చెప్పారు.

సాధారణ వ్యక్తులే విత్తన విక్రేతలు
ఇటీవల టాస్క్‌ఫోర్స్‌ అధికారులు, పోలీసులు రహదారులపై తనిఖీలు చేస్తూ పట్టుకున్న వారిలో 100 మంది లైసెన్సుల్లేని సాధారణ వ్యక్తులేనని తేలింది. వీరు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు అక్రమంగా విత్తనాలు తెస్తున్నట్లు వెల్లడైంది. ఖమ్మం జిల్లాలో రెండు రోజుల కిందట టాస్క్‌ఫోర్స్‌ బృందాలు జరిపిన దాడుల్లో 14,805 విత్తన ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని 14 మందిపై కేసులు పెట్టారు. సుమారు 7400 ఎకరాలకు సరిపోయే ఈ విత్తనాలను సాగు చేసి ఉంటే.. ఎకరాకు రూ.40 వేల చొప్పున రైతులు రూ.296 కోట్లు పెట్టుబడి పెట్టేవారు. ఆ సొమ్మంతా తీవ్రంగా నష్టపోయి ఆ రైతు కుటుంబాలు వీధిన పడేవని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. నాసిరకం మిరప విత్తన అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిధర చాలా ఎక్కువగా ఉండటంతో రైతులు స్థానికంగా అమ్మే వ్యక్తుల నుంచి కొనేస్తున్నారు. మిరప సాగుకు ఎకరాకి రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టాలి. విత్తనాలు బాగా లేకపోతే చివరికి అంత సొమ్ము నష్టపోయి రైతు కుటుంబం వీధిన పడుతుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రైతులు నకిలీ, నాసిరకం విత్తనాలమ్మే వ్యాపారుల ఉచ్చులో చిక్కుకోవద్దని, సమగ్ర వివరాలు పరిశీలించి సంతృప్తి చెందాకనే విత్తనాలు కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ ప్రచారం చేస్తోంది.

నకిలీలు నాటితే.. నిండా మునకే..

రాష్ట్రంలో రైతులు ఇప్పటికీ పెట్టుబడులు, విత్తనాల కోసం వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ముందస్తుగా రైతులు విత్తనాలను దుకాణదారుల వద్ద అప్పుపై తీసుకుంటున్నారు. ఈ కారణంగా చాలా మంది విత్తనాలు కొనే సమయంలో దుకాణదారు నుంచి రశీదును అడిగి తీసుకోవడం లేదు. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు నకిలీ లేదా నాసిరకం విత్తనాలను రైతులకు అమ్మడం, అధిక ధరను వసూలు చేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా వ్యాపారులు రైతుల పేరిట రశీదులు తయారుచేస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. వీటిపై రశీదులపై రైతుల సంతకాలు ఉండటం లేదు.

పరిశీలించాల్సిన అంశాలు

* విత్తనాలు ఎక్కడ ఉత్పత్తి చేశారు, ఎక్కడ శుద్ధి చేశారనేది ప్యాకెట్‌ లేదా విత్తన సంచిపై ఉందో లేదో చూడాలి.
* జన్యు స్వచ్ఛత, మొలకశాతం, విత్తనాల వాడుక గడువు తేదీ గుర్తించాలి.
* ధర, కంపెనీ పేరు, బ్రాండు వివరాలు, విత్తనాల రకం తెలుసుకోవాలి.
* సంకరజాతి తదితర వివరాలు ఉన్నాయా లేదా అన్నది పరిశీలించాలి.
* విత్తన తయారీ కంపెనీ పేరు, చిరునామా, ఫోన్‌ నంబరు సరిచూడాలి.
* ఇవన్నీ క్యూఆర్‌ కోడ్‌ రూపంలో ముద్రించి ఉంటాయి. రైతు తన సెల్‌ఫోన్‌తో ఆ కోడ్‌ను స్కాన్‌ చేస్తే అందులోని వివరాలన్నీ ఫోన్‌లో కనిపిస్తాయి.

ఇదీ చూడండి:CLP: ప్రభుత్వ భూముల వేలాన్ని అడ్డుకుంటాం: భట్టి

ABOUT THE AUTHOR

...view details