దిల్లీలో జరిగిన వింగ్స్ ఇండియా-2020 సన్నాహాక సదస్సులో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. హైదరాబాద్ బేగంపేట వేదికగా మార్చి 12 నుంచి 15 వరకు వింగ్స్ ఇండియా సదస్సు జరగనుంది. ఇందుకోసం దిల్లీలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో కేటీఆర్ పాల్గొన్నారు.
త్వరలో బేగంపేటలో ఇన్‌స్టిట్యూట్
వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం, జక్రాన్‌పల్లి, రామగుండం, మహబూబ్‌నగర్‌లో కొత్త విమానాశ్రయాలతోపాటు పలు ప్రాంతాల్లో హెలీపోర్టుల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి వివరించారు. హెలీపోర్టుల ద్వారా ఆలయ పర్యటక అభివృద్ది చెందుతుందన్నారు. సివిల్ ఏవియేషన్ శిక్షణ కోసం బేగంపేటలో ఈ ఏడాది ఇన్‌స్టిట్యూట్ ప్రారంభిస్తామని.... క్రమంగా ఏరోస్పేస్ యూనివర్సిటీ స్థాయికి విస్తరిస్తామని తెలిపారు. నిధులు, త్వరితగతిన అనుమతులు ఇచ్చి కేంద్రం సహకరించాలని కేటీఆర్ కోరారు.
రాష్ట్రంలో పాత విమానాశ్రయాలను పునరుద్ధించడం సహా గ్రీన్ ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మారుమూల ప్రాంతాలను కలిపేందుకు హెలీపోర్టుల స్థాపన కోసం ప్రయత్నిస్తున్నాం. ఇలా చేస్తే ఆదిలాబాద్ సహా ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి వంటి ప్రాంతాలకు రాకపోకలు పెరుగుతాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్రం నిధులు, అనుమతులివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా. వరంగల్ విమానాశ్రయాన్ని అతిత్వరలో అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ ఎయిర్‌పోర్టు వల్ల ప్రాంతీయ అనుసంధానం పెరుగుతుంది. దేశంలోనే అతిపెద్దదైన వరంగల్ టైక్స్‌టైల్ పార్కుకు సహాయకారిగా ఉంటుంది.... కేటీఆర్