IT Dept Announced Seize Amount :ఎన్నికల తనిఖీల్లో(TS Election Code) భాగంగా ఇప్పటివరకు రూ.53 కోట్ల డబ్బు స్వాధీనం చేసుకోగా.. అందులో లెక్కల్లో చూపని డబ్బు రూ.1.76 కోట్లు మాత్రమేనని ఆదాయపు పన్ను శాఖ స్పష్టంచేసింది. అన్ని వివరాలు పరిశీలించిన తర్వాత రూ.10 కోట్ల 99 లక్షల రూపాయలు వెనక్కి ఇచ్చేశామని తెలిపారు. మిగతా డబ్బునకు సంబంధించి దర్యాప్తు జరుగుతోందన్నారు.156 కోట్ల విలువైన బంగారం, 454 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నామని.. ఈ సొత్తంతా సరైందేనని ఆదాయ పన్నుశాఖ ఇన్వెస్టిగేషన్ వింగ్ డైరెక్టర్ జనరల్ సంజయ్ బహద్దూర్ తెలిపారు.
TS Election Code Seize Amount Value :తమ సొంత సమాచారం ద్వారా రూ.14.8 కోట్ల స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆదాయపన్నుశాఖ నుంచి దాదాపు 250 మంది అధికారులు ఎన్నికల ఖర్చు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారన్నారు. రూ, 10 లక్షలకు మించి డబ్బు స్వాధీనం అయినప్పుడు మాత్రమే.. తమకు సమాచారం ఇస్తారని, అంతకంటే తక్కువ డబ్బు పట్టుబడ్డప్పుడు స్థానిక యంత్రాంగమే దర్యాప్తు జరిపి తదనుగుణంగా చర్యలు తీసుకుంటుందని ఆయన వెల్లడించారు.
Telangana Assembly Elections 2023 :ఎన్నికల వేళ నగదు లావాదేవీలు పర్యవేక్షించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని సంజయ్ తెలిపారు. అన్ని జిల్లాల్లోనూ క్విక్ రియాక్షన్ బృందాలు ఏర్పాటు చేశామని, స్థానిక అధికారులు నగదు, నగలు వంటివి పట్టుకోగానే అరగంటలోనే వీరు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు మొదలు పెడతారని.. 24 గంటల వ్యవధిలోనే పరిశీలన పూర్తిచేస్తామన్నారు. ఏదైనా ఖాతాలో అసాధారణంగా డబ్బు జమ అయినట్లు.. ఉపసంహరించుకున్నట్లు గమనిస్తే వెంటనే రంగంలోకి దిగుతామన్నారు. ఎన్నికల్లో మొదటిసారి 'ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టం యాప్ ఉపయోగిస్తున్నామనివి ఆదాయపన్నుశాఖ నోడల్ అధికారి కార్తీక్ మనిక్కం వివరించారు.