తెలంగాణ రాజధాని హైదరాబాద్.. లక్షల కోట్ల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రం. ముఖ్యంగా ఐటీ, ఫార్మాస్యూటికల్, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్‌కు కేంద్రంగా దేశ, అంతర్జాతీయ ప్రాచుర్యం పొందింది. ప్రధానంగా నగరానికి ఆధునిక హంగులు అద్దిన.. ఐటి రంగం అభివృద్ధితో నగర స్వరూపం మారిపోయింది. ఈ రంగ సంస్థలు ఎక్కువగా మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో విస్తరించటంతో.. ఆ ప్రాంతం మిగతా నగరానికి భిన్నంగా అభివృద్ధి చెందింది. నగరం పశ్చిమం వైపుకే అభివృద్ధి పరిమితమైంది.. దీంతో రానున్న నూతన సంస్థలు, కంపెనీలను, తద్వారా వచ్చే అభివృద్ధిని మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకు గ్రిడ్-గ్రోత్ ఇన్ డిస్‌పర్షన్ పాలసీని తీసుకొచ్చింది. లుక్ ఈస్ట్, లుక్ నార్త్ ఫర్ ఐటీ అనే విధానంతో నగరం తూర్పు, ఉత్తర ప్రాంతాల్లోనూ ఐటీ విస్తరించేలా ప్రోత్సహిస్తుంది.
కొవిడ్ పరిస్థితుల్లోనూ 10 శాతం వృద్ధి
హైదరాబాద్‌కు ఐటీ రంగం ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఇక్కడి నుంచి దాదాపు 2 వేల ఐటీ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా.. 7 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గతేడాది రాష్ట్ర ఐటీ రంగం.. 17 శాతం వృద్ధిని నమోదు చేయగా.. కొవిడ్ పరిస్థితుల్లోనూ 10 శాతం వృద్ధిని సాధించింది. ఈ వృద్ధిని ఇలాగే కొనసాగిస్తే.. రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రంలో ఐటీ ఉద్యోగులు పది లక్షలకు చేరుకుంటారని ఓ అంచనా... ఇంతటి ముఖ్యమైన రంగాన్ని నగరమంతటా విస్తరించాలని ప్రభుత్వం గట్టి సంకల్పంతో ఉంది. అందుకు నగరం నలువైపులా మౌలిక వసతులను కల్పిస్తూ.. కొత్త సంస్థలకు స్థలాలను కేటాయిస్తోంది. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాంతాల్లో పెట్టుబడులకు ముందుకు వచ్చే కంపెనీలకు ప్రత్యేక రాయితీలు అందించేందుకు విధాన నిర్ణయం తీసుకుంది. నగరంలోని ఉప్పల్, నాగోల్, పోచారం, మహేశ్వరం, తుక్కుగూడ, ఆదిభట్ల, కొల్లూరు వంటి ప్రాంతాల్లో కంపెనీలు ఏర్పాటయ్యేలా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా.. ఈ ప్రాంతాల్లో ఐదు ఐటీ పార్కుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
ఇతర నగరాలకు విస్తరణ
ఇప్పటి వరకు హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీని.. రాష్ట్రంలోని ఇతర నగరాలకు విస్తరించేలా ప్రభుత్వం కార్యచరణను ప్రారంభించింది. ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్ వంటి నగరాల్లో ఐటీ కారిడార్‌లు, టవర్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే వరంగల్, కరీంనగర్లో కొన్ని సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయి. వాటిని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. త్వరలోనే మిగతా చోట్లా ఐటీ టవర్లు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఆఫీస్ స్వేస్‌కు రోజురోజుకూ డిమాండ్
మరోవైపు హైదరాబాద్ భౌగోళిక పరిస్థితుల కారణంగా.. వరదలు, భూకంపాలు రాని సురక్షిత ప్రాంతంగా గుర్తింపు పొందింది. దీంతో డాటా సెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం.. డాటా సెంటర్స్, సైబర్ సెక్యూరిటీ పాలసీలను తీసుకొచ్చింది. మరోవైపు కంపెనీల విస్తరణ, పెట్టుబడుల వెల్లువతో హైదరాబాద్‌లో ఆఫీస్ స్వేస్‌కు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. గత ఐదేళ్లలో నగరంలో ఆఫీస్ స్పేస్ మూడింతలు పెరగగా... దేశవ్యాప్తంగా తెలంగాణ ఆరో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. ఈ విషయాన్ని ప్రముఖ రియల్ ఎస్టేట్ అధ్యయన సంస్థ నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. దీంతో భాగ్యనగరంలోని భూముల విలువల భారీగా పెరుగుతోంది.