తెలంగాణ

telangana

ETV Bharat / state

"దేశ ఆహార భద్రతకు విత్తనమే కీలకం" - ista

హైదరాబాద్ వేదికగా ప్రారంభమైన ఇస్టా స‌ద‌స్సుతో...  తెలంగాణ ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి చేరింది. నొవాటెల్‌ హోటల్లో జులై 3 వరకు జరగనున్న ఇస్టా కాంగ్రెస్ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ప్రపంచ మార్కెట్లోకి తెలంగాణ విత్తనాలు మరింత స్థాయిలో ఎగుమతి అయ్యేందుకు వెసులుబాటు కలిగింది. ఆసియాలోనే రాష్ట్రానికి అరుదైన ఘ‌న‌త‌ దక్కింది.

ఇవాళ విత్తనోత్పత్తిపై రైతు సదస్సు

By

Published : Jun 27, 2019, 5:19 AM IST

Updated : Jun 27, 2019, 7:34 AM IST

ఇస్టా కాంగ్రెస్ - 2019 ఘనంగా ప్రారంభం

ఇవాళ విత్తనోత్పత్తిపై రైతు సదస్సు
భాగ్యనగరం వేదికగా 32వ ఇస్టా కాంగ్రెస్ - 2019 బుధవారం ఘనంగా ప్రారంభమైంది. తొలి రోజు అంతర్జాతీయ విత్తన పరీక్షా అసోసియేషన్ సదస్సును కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వ్యవసాయ అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఐరాస అనుబంధ ఎఫ్‌ఏఓ, సౌత్ - సౌత్ కో-ఆపరేషన్‌, రాష్ట్ర సేంద్రీయ, విత్తన ధ్రువీకరణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరగనున్న ఈసదస్సులో 70 దేశాల నుంచి 350 మంది ప్రతినిధులు, దేశం నలుమూలల నుంచి 350 మంది మొత్తం 700 మంది బహుళ జాతి, జాతీయ విత్తన కంపెనీల ప్రతినిధులు, ఇక్రిశాట్‌, ఐసీఏఆర్ అనుబంధ పరిశోధన సంస్థలు, ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు హాజరయ్యారు.

రైతు ఆదాయం రెట్టింపు చేయటమే లక్ష్యం
వ్యవసాయ సంక్షోభం నుంచి గట్టెక్కించే క్రమం 2022 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో మోదీ సర్కారు కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కైలాష్ చౌదరి అన్నారు. వ్యవసాయంలో విత్తనం బాగుంటేనే మంచి నాణ్యమైన అధిక దిగుబడులతో పంట చేతికొస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో తెలంగాణ విత్తన రంగం అభివృద్ధి చెందుతోందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. భారతదేశ విత్తన రంగంలో తెలంగాణ‌ది పెద్దన్న పాత్ర అని పేర్కొన్నారు.

స్టాళ్లు పరిశీలించిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు
బహుళ జాతి, జాతీయ ప్రైవేటు, ప్రభుత్వ కంపెనీల ఆధ్వర్యంలో 30 పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. ప్రైవేటు సంస్థలతోపాటు ఇక్రిశాట్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, వ్యవసాయ వర్సిటీ ఆధ్వర్యంలో ప్రధాన ఆహార పంట వరి, మొక్కజొన్న, జొన్న, మిరప, పత్తి, పప్పుధాన్యాలు, వేరుశనగ, ఆముదం, పొద్దుతిరుగుడు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరల విత్తనాలు స్టాళ్లు కొలువుదీరాయి. ఆయా స్టాళ్ల ప్రత్యేకత తెలుసుకుంటూ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు కలియ తిరిగి పరిశీలించారు.

నాణ్యమైన విత్తనోత్పత్తిపై సదస్సు
ఇవాళ ఇస్టా సదస్సులో విత్తనోత్పత్తి రైతు సదస్సు జరగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి 1600 మంది రైతులు హారజరయ్యే ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల వ్యవసాయ శాఖల మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కురసాల కన్నబాబు, హాజరుకానున్నారు. నాణ్యమైన విత్తనోత్పత్తిలో రైతులకు అవగాహన కల్పించనున్నారు.

ఇవీ చూడండి: సచివాలయం, అసెంబ్లీ భవనాలకు భూమి పూజ

Last Updated : Jun 27, 2019, 7:34 AM IST

ABOUT THE AUTHOR

...view details