రేషన్ కార్డుల జారీలో అనర్హులకు చెక్ పెట్టేందుకు పౌరసరఫరాల శాఖ రంగంలోకి దిగింది. కొత్తగా కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి వివరాలను '360 డిగ్రీల సాఫ్ట్‌వేర్'తో జల్లెడ పడుతోంది. ఈ ప్రాథమిక ప్రక్రియలో అర్హులని తేలితేనే ఆ దరఖాస్తును పరిశీలిస్తారు. లేదంటే తిరస్కరించినట్లు సంబంధిత దరఖాస్తుదారుకు సమాచారం ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసే సరకులను చాలా మంది తీసుకోవడం లేదు. సరకుల కోటా చాలా వరకు మిగిలిపోతుంది. ఎందుకీ పరిస్థితి అని అప్పట్లో పౌరసరఫరాల శాఖ అధికారులు ఆరా తీయగా ప్రభుత్వ పథకాల కింద లబ్ధి పొందడానికే చాలామంది రేషన్ కార్డులను తీసుకుంటున్నారని తేలింది. ఈ క్రమంలో ఆదాయపు పన్ను, ఇంటి పన్ను చెల్లించేవారు, ప్రభుత్వోద్యోగులు, పింఛను తీసుకునే వారు, కారు కలిగి ఉన్న వారి వివరాలను ఆయా శాఖల నుంచి సేకరించారు. ఆ సమాచారం ఆధారంగా వారి కార్డులను తొలగించారు.
ఈ లెక్కన ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే లక్ష నుంచి 1.5 లక్షల కార్డులను రద్దుచేశారు. ఈ జాబితాలో పలువురు అర్హులు కూడా ఉండటంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో గతంలో మాదిరిగా విమర్శలు రాకుండా, అనర్హులకు కార్డులు దక్కకుండా పకడ్బందీగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఎన్‌ఐసీ, ఐటీ తదితర శాఖలు సంయుక్తంగా రూపొందించిన ‘360 డిగ్రీలు’ అనే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. ఇందులో ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారు, ఉద్యోగులు.. ఇలా పౌరులకు సంబంధించి వివిధ శాఖల నుంచి సేకరించిన సమాచారాన్ని పొందుపర్చారు. రేషన్ కార్డు దరఖాస్తులో పేర్కొన్న ఆధార్ నంబరు సాయంతో ఈ జాబితాలో సదరు దరఖాస్తుదారులు ఉన్నారో లేదో జల్లెడ పడుతున్నారు. ఒకవేళ ఉంటే ఆ దరఖాస్తును అప్పటికప్పుడు తిరస్కరిస్తున్నారు. లేకపోతే సదరు దరఖాస్తును సంబంధిత జిల్లా అధికారులకు పంపుతున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ జిల్లా పరిధిలో 95 వేల దరఖాస్తులకు సంబంధించిన సమాచారాన్ని ఇటీవలే ఐటీ శాఖకు పంపించారు. అక్కడి నుంచి సమాచారం అందగానే తదుపరి పక్రియను ప్రారంభించనున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
25లోగా దరఖాస్తుల పరిశీలన..