రాయలసీమలో తొలిదశలో దాదాపు రూ.27వేల కోట్ల విలువైన సాగునీటి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ సన్నాహాలు చేస్తోంది. సీమ నాలుగు జిల్లాల్లో కరవు నివారణ పథకాలతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు కృష్ణా జలాలు తరలించేందుకు వీలుగా ఈ పథకాలకు రూపకల్పన చేశారు. దాదాపు రూ.35వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రతిపాదనలు సిద్ధమైనా... తొలిదశలో చేపట్టాల్సిన ప్రాజెక్టులనే పట్టాలకెక్కించేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఇందులో భాగంగా వివిధ జలాశయాలు, కాలువల సామర్థ్యం పెంచడం, తక్కువ వరద ఉన్న రోజుల్లోనే వీలైనంత ఎక్కువ నీటిని జలాశయాలకు మళ్లించే ఉద్దేశంతో వీటిని చేపడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం ఈ ప్రాజెక్టుకు రాయలసీమ కరవు నివారణ పథకంగా పేర్కొంటూ పనులు చేపడుతున్నారు.
త్వరలో టెండర్లు
జోలదరాశి జలాశయం, రాజోలి ఆనకట్టపై కొత్త జలాశయం నిర్మాణం, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి బనకచర్ల కాంప్లెక్సుకు కాలువల సామర్థ్యం పెంపు వంటి దాదాపు 8 పనులకు టెండర్లు పిలిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ పనులకు పాలనామోదం లభించింది. జ్యుడీషియల్ సమీక్ష తర్వాత రివర్స్ టెండర్ల ప్రక్రియలో పనులు చేపట్టేందుకు టెండర్ షెడ్యూళ్లు జారీ చేయనున్నారు.
కుందూ వద్ద రూ.565 కోట్లతో ఎత్తిపోతల పనులు చేపట్టనున్నారు. గాలేరు నగరి సుజల స్రవంతి పథకం కాలువను అవుకు రిజర్వాయర్, గండికోట జలాశయం వరకు విస్తరణ పనులు చేపట్టనున్నారు. రెండో అవుకు టన్నెల్ నిర్మాణానికి రూ.145 కోట్ల అంచనా విలువతో పనులు చేపట్టేందుకు గుత్తేదారుతో జలవనరులశాఖ ఒప్పందం చేసుకోవాల్సి ఉంది.
చీఫ్ ఇంజినీర్ల వద్ద రూ.7,153 కోట్ల పనులు
పథకంలో భాగంగా రూ.7,153 కోట్ల విలువైన పనులకు ఆయా చీఫ్‌ఇంజినీర్లు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపే పనిలో ఉన్నారు. వీటిని సచివాలయంలో జలవనరుల, ఆర్థికశాఖ పరిశీలన అనంతరం పాలనామోదం రానుంది. రూ.3,574 కోట్లతో గండికోట నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్ జలాశయానికి నీటిని తరలించే ఎత్తిపోతల సామర్థ్యం పెంపు, గండికోట నుంచి పైడిపాలేనికి నీటిని తరలించే ఎత్తిపోతల సామర్థ్యం పెంపునకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కొన్ని ప్రశ్నలతో వెనక్కు
హంద్రీనీవా ప్రధాన కాలువ 4.500 కిలోమీటరు నుంచి 216.30 కిలోమీటరు వరకు దాదాపు రూ.6,300 కోట్లతో చేపట్టనున్న పథకం పాలనామోదం కోసం పరిశీలనలో ఉంది. కొన్ని సందేహాలు ఉండటంతో వాటి నివృత్తి కోసం ఈఎన్‌సీకి పంపినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులకు త్వరగా టెండర్లు పిలవాలని ఉన్నతాధికారుల స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. వెలిగల్లు ప్రాజెక్టు నవీకరణ పనులు రూ.15 కోట్లతో టెండర్లు పిలిచారు. కమిషనర్ ఆఫ్ టెండర్ల వద్ద పరిశీలనలో ఉంది.
ఇదీ చదవండి:మిడతల ముప్పును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం: మంత్రి నిరంజన్ రెడ్డి