నిధుల వ్యయంలో ముందున్నా.. అనుకున్నంత ఆయకట్టు సాధించడంలో మాత్రం లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. 2021-22 సంవత్సరంలో 22.68 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది మార్చిలో శాసనసభకు సమర్పించిన బడ్జెట్ ఫలితాల నివేదికలో ఈ విషయం పేర్కొంది. ఇప్పుడు తాజాగా ప్రవేశపెట్టిన నివేదికలో 1,62,670 ఎకరాల ఆయకట్టు మాత్రమే సాధించినట్లు నివేదించింది. అంతకుముందు సంవత్సరం కూడా 1,85,000 ఎకరాలకే సాగునీటిని సమకూర్చగలిగినట్లు తెలిపింది. దీనిని బట్టి బడ్జెట్ సమయంలో నీటిపారుదల శాఖ చేసే ప్రతిపాదనలకు, ఆచరణకు మధ్య భారీగా తేడా ఉంటున్నట్లు స్పష్టమవుతోంది.
2021-22వ ఆర్థిక సంవత్సరంలో గత డిసెంబరు వరకు రాష్ట్ర ప్రణాళిక, బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణం కలిపి రూ. 19,468.35 కోట్లు ఖర్చు చేసినట్లు తాజాగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నీటిపారుదల శాఖ బడ్జెట్ ఫలితాల నివేదిక వెల్లడించింది. ఫిబ్రవరి ఆఖరు వరకు రూ. 21,000 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో సగానికి పైగా కాళేశ్వరానికే వెచ్చించింది. అంతకుముందు సంవత్సరం రూ. 19,508 కోట్లు ఖర్చు చేసింది.
కాళేశ్వరం కింద పది శాతమైనా కాలేదు!
2021-22లో 15 భారీ ప్రాజెక్టుల కింద, 5 మధ్యతరహా ప్రాజెక్టులు, చిన్న నీటి వనరుల కింద కలిపి 22.68 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సామర్థ్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింద 22.08 లక్షల ఎకరాల ఆయకట్టు ప్రతిపాదించగా, ఒక్క కాళేశ్వరం కిందనే 12.64 లక్షల ఎకరాలు నిర్దేశించుకుంది. తాజా నివేదిక ప్రకారం భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల కింద కల్పించిన సాగునీటి సామర్థ్యం 1,62,670 ఎకరాలు. ఇందులో దేవాదుల ఎత్తిపోతల కింద 1,33,929 ఎకరాలు, కాళేశ్వరం కింద 28,741 ఎకరాలకు సాగునీరు అందించినట్లు తెలిపింది. కాళేశ్వరం కింద లక్ష్యంలో పది శాతం కూడా రాలేదు.
కాలువలు, డిస్ట్రిబ్యూటరీ పనులో జాప్యమే దీనికి కారణంగా తెలుస్తోంది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ), ఎల్లంపల్లి ఎత్తిపోతల, శ్రీరామసాగర్ వరదకాలువ, డిండి ఎత్తిపోతల, దిగువ పెన్‌గంగా, సీతారామ ఎత్తిపోతల తదితర పథకాల కింద భారీ లక్ష్యాలు నిర్ణయించుకుంది. 2021-22లో కాళేశ్వరం కింద 12.64 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా పెట్టుకొన్న నీటిపారుదల శాఖ, 2022-23లో దీనిని 6.47 లక్షల ఎకరాలకు తగ్గించింది. సీతారామ ఎత్తిపోతల కింద 3.87 లక్షల ఎకరాలు అనుకున్నా అది నెరవేరలేదు. వచ్చే సంవత్సరం 3.28 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించాలని ప్రతిపాదించారు. ఇది అమలు కావాలంటే డిస్ట్రిబ్యూటరీ పనులను పూర్తి చేయాల్సి ఉంది. పనులు జరుగుతున్న తీరు, నిధుల కేటాయింపులను పరిశీలిస్తే ఎస్‌ఎల్‌బీసీ, డిండి, సీతారామ ఎత్తిపోతల తదితర ప్రాజెక్టుల కింద వచ్చే సంవత్సరం కూడా సాగునీటి సామర్థ్యం కల్పించడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదీ చూడండి: