హైదరాబాద్ జాతీయ పోలీసు అకాడమీ నుంచి మరో ఐపీఎస్‌ల బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకుంది. 72వ బ్యాచ్‌లో 178 మంది శిక్షణ పొందగా.. వారిలో 144 మంది ఐపీఎస్, 34 మంది ఫారెన్ ఆఫీసర్ ట్రైనీలు శిక్షణ పొందారు. నేపాల్, భూటాన్, మారిషస్, మాల్దీవులకు చెందిన 34మంది మన ఐపీఎస్‌లతో పాటు శిక్షణ పొందారు. గత బ్యాచులతో పోలిస్తే ఈసారి మహిళలు ఎక్కువమంది ఉండగా.. 23 మంది శిక్షణపూర్తి చేసుకున్నారు. అందులో భాగంగా 15వారాలు ముస్సోరీతో పాటు హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో ఫౌండేషన్ కోర్సు పూర్తిచేశారు. 2019 డిసెంబర్ 16న జాతీయ పోలీస్ అకాడమీలో చేరి తొలిదశ శిక్షణ పొందారు. 30 వారాల వ్యవధిలో చట్టం, న్యాయం, భారత శిక్షాస్మతిచట్టం, దర్యాప్తు, ఫోరెన్సిక్ సైన్స్, శాంతి భద్రతలు, మానవ హక్కులు, నేర నియంత్రణ-దర్యాప్తు, ప్రత్యేకచట్టాలు, ఆధునిక భారత దేశంలో పోలీసింగ్ విధానం గురించి అభ్యసించారు. ఈ ఫిబ్రవరిలో మళ్లీ అకాడమీలో చేరి 29 వారాల్లో రెండోదశ శిక్షణ పూర్తి చేసుకున్నారు. కరోనా కారణంగా శిక్షణ సమయంలో ఆన్‌లైన్‌లోనూ క్లాసులు నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాలకు ఎనిమిది మంది
మొత్తం 144 మంది ఐపీఎస్‌లలో ఇంజనీరింగ్ చదివిన వాళ్లు 105 మంది ఉండగా 20 మంది ఆర్ట్స్, 8 మంది సైన్స్, ఐదుగురు ఎంబీబీఎస్, నలుగురు కామర్స్, ఇద్దరు న్యాయశాస్త్రం చదివిన వాళ్లున్నారు. 80 మంది ఇది వరకు ఉద్యోగం చేసుకుంటూనే యూపీఎస్సీ పరీక్ష రాసి ఐపీఎస్‌కు ఎంపిక కాగా.. మరో 64 మంది కొత్తవారున్నారు. తెలుగు రాష్ట్రాలకు 8 మందిని కేటాయించగా. వారిలో తెలంగాణకు, ఏపీకి చెరో నలుగురున్నారు. ప్రస్తుతం సైబర్ నేరాలు పోలీస్ శాఖకు సవాల్‌గా మారిన నేపథ్యంలో.. ఆ బ్యాచులో 105 మంది ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన వాళ్లు ఉండటం కలిసొచ్చే అంశమని అకాడమీ సంచాలకులు అతుల్ కార్వల్ తెలిపారు. సైబర్ నేరాల నిరోధానికి నూతన ఐపీఎస్‌లు తమ వంతు కృషి చేస్తారని స్పష్టం చేశారు.
అకాడమీలో ఉన్న శిక్షణ ఐపీఎస్‌లు అనేక మెలకువలు సాధించారు. అకాడమీలో ఉన్న సమయంలో సగం కాలంపాటు అంతర్గత శిక్షణను పూర్తి చేశారు. ఆధారాల సేకరణ, నేరం జరిగిన ప్రాంతాలపై సునిశీత పరిశీలన చేసి న్యాయస్థానంలో ఎలా నిరూపించాలన్న అంశాలపై తరగతులు నిర్వహించటం జరిగింది. సైబర్ నేరాలు అరికట్టడం, విచారణలో సాంకేతికతను ఎలా వినియోగించాలన్న అంశాలపై శిక్షణ పొందారు. దేశంలోని భద్రతా బలగాలు వద్ద ఉన్న అన్నీ ఆయుధాలను సమర్థంగా వినియోగించటంలో ఆరితేరారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వ్యూహత్మక ఆపరేషన్ల నిర్వహణలో చక్కని నైపుణ్యం పొందారు. -అతుల్ కార్వల్, జాతీయ పోలీస్ అకాడమీ సంచాలకులు.