కొవిడ్ వల్ల ఎన్నో పరిశ్రమలు దెబ్బతిన్నాయి. ఇవి మళ్లీ లాభాల బాట పట్టడానికి అమలుచేయాల్సిన మొదటి నాలుగు టెక్నాలజీల్లో ఐఓటీ ఒకటి. శాంసంగ్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, క్వాల్కమ్, ఇంటెల్ లాంటి ఎన్నో అగ్రశ్రేణి సంస్థలు సైతం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. అభివృద్ధి చెందుతూ భారీ సంఖ్యలో ఉద్యోగాలను కల్పించే సామర్థ్యమున్న టెక్నాలజీ ఇది!
స్మార్ట్ వాచ్, స్మార్ట్ సిటీ, స్మార్ట్ హోం.. ఈ మాటలు వినే ఉంటారు. స్మార్ట్ వాచ్‌తో శారీరక కదలికలు, గుండె కొట్టుకునే వేగం, రక్తంలో ఆక్సిజన్ స్థాయి వంటివి చూసుకుంటాము. అలాగే టెస్లా కారులో ప్రత్యేకమైన ‘ఆటో పైలట్’ ఫీచర్ గురించి వినే ఉంటారు. ఈ ఫీచర్‌తో డ్రైవర్ అవసరం లేకుండా కార్ అదే సొంతంగా డ్రైవ్ చేసుకుంటుంది. ట్రాఫిక్ సిగ్నళ్లను పాటిస్తుంది, సొంతంగా పార్కింగ్ చేసుకుంటుంది. అలాగే- పార్క్ చేసి ఉన్న కారు దానికదే మీ ముందుకు వస్తుంది.. వినడానికి ఆసక్తిగా, ఆశ్చర్యంగా ఉంది కదా?
ఈమధ్య కాలంలో ‘ఎలాన్ మస్క్’ అనే పేరు తెలియనివారు లేరు. టెస్లా ఆయన మానస పుత్రికే. ఆయన స్థాపించిన కంపెనీ- ‘స్పేస్ ఎక్స్’ రాకెట్ ఇంజినీరింగ్‌లోని గొప్ప సాంకేతిక పురోగతి సాధించింది. సాధారణంగా రాకెట్ తయారుచేయాలంటే కొన్ని వందల కోట్లు ఖర్చు అవుతుంది. అదే రాకెట్‌ను పునర్వినియోగపరచుకుంటే కొన్ని కోట్లు ఆదా చేయవచ్చు. స్పేస్ ఎక్స్ వారి ఫాల్కన్ రాకెట్ అలాంటిదే. 5 లక్షల కేజీల బరువు, 70 మీటర్ల పొడవు ఉండే రాకెట్ కేవలం 20 మీటర్ల వెడల్పు ఉండే ప్యాడ్ మీద ల్యాండ్ అవగలుగుతుంది. ఇలాంటివి సాధ్యపడేలా చేసే టెక్నాలజీల్లో ఐఓటీ చాలా కీలకమైనది.
వస్తువులన్నీ అనుసంధానమైతే..
స్మార్ట్ ఫోన్ లేకుండా మనం రోజును ఊహించుకోలేం అంటే అతిశయోక్తి కాదు. అమెరికాలో ఉండే మీ స్నేహితుడితో మీరు వీడియో కాల్ మాట్లాడుతున్నారు. ఇష్టమైన సినిమా చూస్తున్నారు. నచ్చిన గేమ్ ఆడుతున్నారు. ఇలా ఎన్నెన్నో పనులు స్మార్ట్ ఫోన్ తో చేయగలుగుతున్నారు. ఒక్క స్మార్ట్ ఫోన్‌తోనే ఇన్ని చేయగలుగుతున్నారంటే ఒక్కసారి ఊహించుకోండి- మీ సమీపంలో ఉన్న- టీవీ, ఏసీ, లైట్, ఫాన్స్.. అన్నీ అనుసంధానమైతే ఎలా ఉంటుంది?
ఇంటి నుంచి బయటకి వెళ్ళేటపుడు ఏసీ, ఫ్యాన్, లైట్ వాటంతట అవే స్విచ్ ఆఫ్ అవ్వడం, మళ్లీ ప్రవేశించినప్పుడు అవే స్విచ్ ఆన్ అవ్వడం! మీరు షాపింగ్ మాల్‌కి వెళ్ళినప్పుడు పార్కింగ్ కోసం వెతకకుండా ఫలానా చోట ఖాళీ ఉందని మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా జరిగితే ఎంత బాగుంటుంది కదా! ఇవన్నీ సాధ్యపడాలంటే మన చుట్టూ ఉన్న వస్తువులన్నీ కనెక్ట్ అయ్యి చాలా తెలివైన నిర్ణయాలు తీసుకోగలగాలి. అలా చెయ్యగలిగే టెక్నాలజీయే ఐఓటీ.
స్మార్ట్ థింగ్స్ అంటే?
మీ చుట్టూ ఉండే పరికరాలు పరిసరాలను సెన్స్ చేస్తాయి. అంటే మీ పర్సు మర్చిపోయారని గ్రహించిన సమాచారాన్ని మీ మొబైల్‌కి కమ్యూనికేట్ చేస్తుంది. అంటే మాట్లాడుతుంది. ఇలా గ్రహించి, తెలుపగలిగి, తెలివిగా ప్రవర్తించేవే స్మార్ట్ థింగ్స్ లేదా కనెక్టెడ్ థింగ్స్. ఇక్కడ ముఖ్యంగా మూడు భాగాలుంటాయి. మొదటిది డివైసెస్ (పరికరాలు) పరిసరాలను సెన్స్ చేయడానికి. రెండోదైన నెట్ వర్క్ ఒక డివైస్ మరొక డివైస్‌తో కమ్యూనికేట్ చేయడానికి. మూడోదైన అప్లికేషన్ ఈ డివైసెస్ తెలివిగా ప్రవర్తించేలా చేయడానికి!
వీటిలో మనకి సెన్సార్లు, పవర్, ప్రాసెసింగ్ (ఎంసీయూ), కమ్యూనికేషన్, ఫర్మ్ వేర్.. ఇలా చాలా ఉంటాయి కానీ ముఖ్యమైనది సెన్సార్లు. మనకు చూడడానికి కళ్ళు, వినడానికి చెవులు, స్పర్శకు చర్మం ఎలా ఉంటాయో ఐఓటీ డివైసెస్‌కి ఈ సెన్సార్లు అలా ఉంటాయన్నమాట.
మొబైల్‌లో 16 సెన్సార్లు..
సెన్సార్లలో చాలా రకాలుంటాయి. వస్తువు ఎంత దూరంలో ఉందో గుర్తించడం కోసం ప్రాక్సిమిటీ సెన్సార్, మన పరిసరాల్లోని కాంతి ఎక్కువ ఉందో, తక్కువ ఉందో తెలుసుకోవడానికి లైట్ సెన్సార్, పరిసరాల్లోని ఉష్ణోగ్రత తెలుసుకోవడానికి టెంపరేచర్ సెన్సార్. అంతెందుకు? మొబైల్‌లో వీడియోలు చూస్తున్నపుడు మొబైల్ దానికదే రొటేట్ అవుతుంది కదా! అదీ గైరోస్కోప్ అనే సెన్సార్ వల్లనే! స్మార్ట్ థింగ్స్ వాటి పరిసరాలను ఈ సెన్సార్ సాయంతోనే సెన్స్ చేస్తాయి. మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్‌లోనే సుమారు 16 సెన్సార్లు ఉంటాయి.
అడ్వాన్స్‌డ్ సెన్సార్..
ఇప్పటివరకు ఇచ్చిన ఉదాహరణలన్నీ సాధారణమైన సెన్సార్లు. అడ్వాన్స్‌డ్ సెన్సార్లు ఎంత ఆధునికమైనవంటే- మెదడులో ఆలోచనలనూ గ్రహించగలవు. వీటితో మీ మెదడుతో మీ శరీర భాగాలను నియంత్రించడమే కాకుండా మీ ఆలోచనలతో వేరొక మనిషి శరీర భాగాలనూ మీరు నియంత్రించవచ్చు. అంటే.. ఈ సెన్సార్‌ని మీతో పాటుగా వేరొక మనిషికి కనెక్ట్ చేస్తే మీ మెదడులో మీ చేతిని కదిలించాలన్న ఆలోచన వస్తే అది మీ చేతినే కాకుండా వేరొక మనిషి చేతినీ కదిలిస్తుంది.