తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా కాలంలోనూ... అభివృద్ధి దిశగా దూసుకెళ్తూ..

కరోనా మహమ్మారి కారణంగా.. దేశవ్యాప్తంగా వ్యాపారాలు మందగించి.. అభివృద్ధి పడకేసినా.. రాష్ట్రంలో మాత్రం పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. లాక్​డౌన్ సడలింపుల తర్వాత పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు, తమ సంస్థల విస్తరణ, కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు తెలంగాణను తమ పెట్టుబడి గమ్యస్థానంగా ఎంచుకునేందుకు క్యూ కడుతున్నాయి. పరిశ్రమలకు వేగవంతంగా అనుమతులు, రాయితీలు కల్పిస్తూ ప్రభుత్వం ప్రోత్సాహిస్తుంటే.. ఇక్కడి నైపుణ్య మానవవనరులు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం... కంపెనీలను ఆకర్షిస్తోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్​లో తెలంగాణ తన సత్తా మరోసారి చాటుతోంది.

investments-in-telangana-state-in-covid-criteria
సంక్షోభంలోనూ అభివృద్ధి దిశగా దూసుకెళ్తున్న రాష్ట్రం

By

Published : Aug 24, 2020, 1:48 PM IST

తెలంగాణ... దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రం. జీఎస్డీపీలో రాష్ట్రం 15 శాతం వృద్ధితో దూసుకెళ్తోంది. 27 వేల 600 కి.మీల మేర రోడ్ నెట్ వర్క్, 24 జాతీయ రహదారులు, అంతర్జాతీయ ఎయిర్ పోర్టు వంటి మౌలికవసతులతో ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. వీటికి తోడు పరిశ్రమలకు వేగవంత అనుమతుల కొరకు ప్రభుత్వం టీఎస్ ఐపాస్​ను తీసుకొచ్చింది. ఇది దేశంలోనే బెస్ట్ పాలసీగా గుర్తింపు పొందింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికోసం పారిశ్రామిక రాయితీలు, ప్రోత్సహకాలు అందిస్తూ... ఒకటిన్నర లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్, దేశంలోనే ఎక్కువ స్పెషల్ ఎకానమిక్ సెజ్​లతో ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్​లోనూ 2016 నుంచి రాష్ట్రం వరుసగా మొదటి, రెండు స్థానాల్లో నిలుస్తోంది.

అపార అవకాశాలు..

ఐటీ, ఎలక్ట్రానిక్స్, లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాలకు మన రాష్ట్రం మోస్ట్ ట్రస్టడ్. ఇవేకాక రాష్ట్రంలో ఎయిరోస్పేస్, డిఫెన్స్, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, లైఫ్ సైన్సెస్, టైక్స్ టైల్, ఎఫ్​ఎమ్​సీజీ, ఐటీ, లాజిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, స్టార్టప్, ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్ సెక్టార్లలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయి. నైపుణ్యం గల యువత, బలమైన స్టార్టప్ ఎకోసిస్టం, గుడ్ గవర్నెన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, సమ్మిళిత వృద్ధి ప్రత్యేకతలు... రాష్ట్రాన్ని ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. ఐటీ రంగంలో ప్రపంచంలోనే టాప్​ ఫైవ్​లో ఉన్న ఐదు ఫార్మా దిగ్గజ కంపెనీలు... హైదరాబాద్​ను తమ గమ్యస్థానంగా చేసుకున్నాయి.

క్రియాశీలక విధానాలతో

ప్రస్తుత సంక్షోభ సమయంలోనూ ఫార్మా, లైఫ్ సైన్స్ రంగాలకు ఉన్న అవకాశాల దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జీనోమ్ వ్యాలీ, మెడికల్ డివైసెస్ పార్క్, హైదరాబాద్ ఫార్మా సిటీ వంటి ప్రాజెక్టులతో హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యుత్తమ పెట్టుబడి గమ్యస్థానంగా నిలుస్తోంది. కోవిడ్ సంక్షోభం అనంతరం సైతం ఫార్మా లైఫ్ సైన్సెస్ పెట్టుబడులను ఆకర్షించేందుకు అవసరమైన ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. పెట్టుబడులను ఆకర్షించటానికి కంపెనీలను మరింత ప్రోత్సాహించాల్సిన అవసరముందని.. ఇందుకొరకు తెలంగాణ రాష్ట్రం క్రియాశీలక విధానాలతో ముందుకెళ్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పేర్కొన్నారు.

ధీమా కల్పిస్తూ...

సంక్షోభంలోనూ అవకాశాలు వెతుక్కొని ముందుకెళ్లినప్పుడే బలమైన భవిష్యత్తుకు పునాది వేసుకోవచ్చని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అన్నట్టుగానే రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక చొరవతో ముందుకెళ్తున్నారు. పలు జాతీయ, అంతర్జాతీయ వేదికల వద్ద రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తున్నారు. రాష్ట్రంలో అమలవుతోన్న పారిశ్రామిక అనుకూల విధానాలను వివరిస్తూ.. అవసరమైన రాయితీలు, ప్రోత్సహకాలు కల్పిస్తామని ధీమా కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో లాక్​డౌన్ సడలింపుల తర్వాత రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి.

పెట్టుబడులతో..

పాలిస్టర్ ఫిల్మ్ తయారీలో అగ్రగామిగా పేరొందిన ఏస్టర్ ఫిల్మ్ టెక్ లిమిటెడ్ కంపెనీ... 1,350 కోట్ల రూపాయల పెట్టుబడితో షాబాద్ మండలం చందన్ వెళ్లిలో ప్యాకేజింగ్ ఫిల్మ్ తయారీ ప్లాంట్​ను ఏర్పాటు చేయనుంది. ఈ తయారీ యూనిట్ ద్వారా 800 మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. మెడికల్ డివైసెస్​లో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ మెడ్ ట్రానిక్స్ 1,200 కోట్ల పెట్టుబడితో అమెరికా అవతల రెండో అతిపెద్ద ఆర్ అండ్ డీ సెంటర్​ను హైదరాబాద్​లో ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా చందన్ వెళ్ళిలో వెల్స్ పన్ ఫ్లోరింగ్ రూ. 2 వేల కోట్లతో ఫ్లోరింగ్ కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా 2,500 మందికి, పరోక్షంగా 5 వేల మంది ఉపాధి పొందనున్నారు. టెక్నికల్ టెక్స్​టైల్స్ విభాగంలోనూ మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్స్ పన్ గ్రూపు ప్రకటించింది.

మరిన్ని భారీ ప్రాజెక్టులు

ఇవేకాక జీనోమ్ వ్యాలీలో సాయి లైఫ్ సైన్సెస్ 400 రూపాయల కోట్ల పెట్టుబడితో ఆర్ అండ్ టీ సెంటర్ విస్తరణ, రంగారెడ్డిజిల్లా శంకరపల్లిలో ప్రైవేట్ సెక్టార్ కంపెనీ మేథా.. 1,100 కోట్ల పెట్టుబడితో రైల్ కోచ్ ఫాక్టరీని నిర్మించనుంది. తద్వారా 2,200 మందికి ఉపాధి దక్కనుంది. నేషనల్ పేమంట్ కార్పొరేషన్ ద్వారా 500 కోట్లు, సింజిన్ ద్వారా రూ.170 కోట్ల పెట్టుబడులను రాష్ట్రం సాధించింది. దీంతో పాటు.. ఎలక్ట్రానిక్స్ ఇతర రంగాల్లో త్వరలో 8 భారీ ప్రాజెక్టులు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

అవకాశాల కోసం

ప్రభుత్వ అనుకూల విధానాలు, రాష్ట్రానికి ఉన్న సానుకూలతలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. రాష్ట్రానికి ఉన్న అదనపు ఆకర్షణ అని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక్కడ నైపుణ్యం గల మానవ వనరులు, బలమైన స్టార్టప్ ఎకోసిస్టం, ఎమర్జింగ్ టెక్నాలజీస్ హైదారాబాద్ ను ప్రత్యేకంగా నిలుపుతున్నాయని వారన్నారు. ప్రభుత్వం సైతం వేగవంత అనుమతులు, డైరెక్ట్ క్లియరెన్స్ వంటి పాలసీలతో పెట్టుబడిదారులను ఆకర్షించటమే కాక, స్థానికులకు ఉద్యోగ అవకాశాలను కల్పించటం ఎకోసిస్టం వృద్ధికి దోహదం చేస్తుందని వారన్నారు.

ఈవెంట్స్​తో ఆకర్షిస్తూ..

సీఐఐ భాగస్వామ్యంతో త్వరలో తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ- ఆపర్చునిటీస్ ఇన్ కొవిడ్ థీమ్​తో మేక్ ఇన్ తెలంగాణ వర్చువల్ ఎగ్జిబిషన్​ను ఈనెల 27న నిర్వహించనుంది. నవంబర్ 24 వరకు... 90 రోజుల పాటు జరిగే ఈ వర్చువల్ ఎగ్జిబిషన్ ద్వారా మరిన్ని పెట్టుబడులను రాష్ట్రం ఆకర్షించనుంది. హైదరాబాద్​లో డిసెంబర్ 8 నుంచి 10 వరకు గ్లోబల్ సదస్సు జరగనుంది. ఈ మెగా ఈవెంట్​తో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను తీసుకురానుంది.

త్వరలో ఆహారశుద్ధి, లాజిస్టిక్ పాలసీలు, లైఫ్ సైన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీల్లో అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రణాళికల రచిస్తూ... ఈరంగాల్లో మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు సర్కారు సమాలోచనలు చేస్తోంది. రీసెంట్​గా ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ రంగం ద్వారా రూ.30 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి.. రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్ మెబిలిటీ హబ్​గా మార్చాలని భావిస్తోంది. ఈ రంగం ద్వారా కంపెనీలను ఆకర్షించి 4లక్షల మందికి ఉపాధి ఇవ్వాలని రాష్ట్రం సంకల్పిస్తోంది. లైఫ్ సైన్సెస్ రంగాన్ని సైతం 50 బిలియన్ డాలర్ల నుంచి 100 బిలియన్ డాలర్ల పరిశ్రమగా అభివృద్ధి చేసి.. నాలుగు లక్షల మందికి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది.

ABOUT THE AUTHOR

...view details