Investigation by SIT Team: తెరాస ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేందుకు, ప్రలోభపెట్టిన వ్యవహారంలో నిందితుల కస్టడీ పూర్తయిన తర్వాత కేసు తదుపరి దర్యాప్తును సిట్ వేగవంతం చేసింది. విచారణపై సిట్ చీఫ్ సీవీ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేలకు ఎర వేసేందుకు ఎప్పటి నుంచి ప్రణాళికలు రచించారు, గతంలో ఎన్నిసార్లు సమావేశమయ్యారు, వారి మధ్య జరిగిన సంభాషణలేమిటి వంటి అంశాలను నిరూపించగలిగితే, కేసు కీలకంగా మారుతుందని భావిస్తున్నారు.
తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డినే తొలుత ఎంచుకోవడానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. నందకుమార్ వ్యవహారశైలిని లోతుగా ఆరాతీస్తున్నారు. నందకుమార్ వ్యాపారాలు, గతంలో అతనిపై కేసులు ఏమైనా ఉన్నాయా అనే వివరాలు సేకరిస్తున్నారు. తిరుపతిలో ఆశ్రమం నిర్వహించే సింహయాజిని పలువురు రాజకీయ ప్రముఖులకు ఆశీర్వాదం పేరుతో నందకుమార్ పరిచయం చేసినట్టు పోలీసులు గుర్తించారు.
అదే పరిచయంతోనే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే అంశంపై చర్చించుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. ఈక్రమంలో దిల్లీకి చెందిన రామచంద్రభారతితో సంప్రదింపులు జరిపి ఉంటారని భావిస్తున్నారు. వారి మధ్య జరిగిన ఫోన్ కాల్స్, వాట్సప్ సంభాషణలు కీలకం కానుండటంతో వాటిని విశ్లేషించటంపై సిట్ అధికారులు దృష్టి సారించారు.