కూలీల కొరత కారణంగా పైరులో కలుపు తొలగించడం రైతులకు ఆర్థిక భారంగా మారింది. ఎకరా విస్తీర్ణంలో పత్తి లేదా వరి పొలాల్లో కలుపు తీయడానికి రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకూ వెచ్చించాల్సి వస్తోంది. ఖర్చు సంగతి అటుంచి వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగే సమయంలో కూలీలు దొరకడమే గగనమవుతోంది. ఈ సమస్య పరిష్కారానికి ‘ఎక్స్-మిషన్స్’ అనే అంకుర సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) పరిజ్ఞానంతో ‘మొబైల్ రోబో’ను రూపొందించింది.
ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ‘అగ్రిహబ్’లో ఈ రోబోను మొక్కజొన్న పైరులో ప్రయోగించి చూశారు. పొలంలో వరసల(సాళ్ల) మధ్య వదిలితే, అది మొక్కజొన్న మొక్కలను మాత్రమే గుర్తించి ఇతర ఏ మొక్క కనిపించినా దానిపై కలుపు నివారణ మందును పిచికారీ చేసింది. సంబంధిత సాఫ్ట్‌వేర్‌ను సెల్‌ఫోన్‌తో అనుసంధానం చేసి రోబోను నియంత్రించవచ్చు. ‘మొక్కలు నాటేటప్పుడే దీని సాయంతో రసాయనాలను చల్లి కలుపు మొక్కలు పెరగకుండా నియంత్రించవచ్చు’ అని జయశంకర్ వర్సిటీ పరిశోధన విభాగం సంచాలకుడు డాక్టర్ జగదీశ్వర్ ‘ఈనాడు’కు చెప్పారు. ఈ రోబోను మొక్కజొన్నతోపాటు ఇతర పంటల్లోనూ కలుపు నివారణ మందులు చల్లేలా వినియోగించే ప్రయోగాలను వర్సిటీ అగ్రిహబ్‌లో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.