కొవిడ్ టీకా ఎప్పుడు అందుబాటులోకి వచ్చినా.. పంపిణీకి సన్నద్ధంగా ఉన్నామని రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఎండీ చంద్రశేఖరరెడ్డి తెలిపారు. 10వేల కేంద్రాల్లో టీకాలను అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందనీ... ఒకవేళ టీకాలిచ్చే క్రమంలో ఎటువంటి దుష్ఫలితం తలెత్తినా సత్వర చికిత్స అందించేందుకు 20వేల ప్రత్యేక కిట్లను సిద్ధం చేశామన్నారు. కొవిడ్ టీకాల పంపిణీలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు అనుసరించిన కార్యాచరణ ప్రణాళికలపై టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖరరెడ్డితో ప్రత్యేక ముఖాముఖి.
ఒకచోటు నుంచి మరోచోటుకు టీకాల తరలింపు సవాల్ కదా?
కచ్చితంగా సవాల్‌తో కూడుకున్నదే. అయితే మనకు ఇప్పటికే సార్వత్రిక టీకాలను అందజేస్తున్న అనుభవం ఉన్నది కాబట్టి.. కొవిడ్ టీకా సరఫరాకు అది ఉపయోగపడుతుంది. టీకాలను సరఫరా చేయడానికి రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే ఒక అతి శీతలీకరణ వాహనం ఉండగా.. మరో 16 జిల్లాల్లోనూ ఇదే తరహా వాహనాలు ఇప్పటికే సేవలందిస్తున్నాయి. వీటికి అదనంగా మరో 19 ఇన్సులేటెడ్ వాహనాలను త్వరలోనే కొనుగోలు చేయనున్నాం. ఇందులో 2 రాష్ట్ర స్థాయిలో సేవలందిస్తాయి. మిగిలిన 17 వాహనాలను జిల్లాకొకటి చొప్పున ప్రభుత్వం కేటాయించింది. వాటితో రాష్ట్రంలోని ప్రతి జిల్లాకో ఇన్సులేటెడ్ వాహనం ఉంటుంది. వీటిలో 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద టీకాలను చాలాకాలం నిల్వ ఉంచవచ్చు. ఆ వాహనాల్లోనే టీకాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, ఇతర ఆసుపత్రులకూ సరఫరా చేస్తారు. ముందుగా వైద్య, పోలీసు, పారిశుద్ధ్య తదితర ముందువరుసలో నిలిచే సిబ్బందికి టీకాలు అందించనుండడంతో.. ప్రస్తుతమున్న వాహనాలతోనే అన్ని జిల్లాలకూ టీకాలను సరఫరా చేయొచ్చు. ఇప్పటికిప్పుడు టీకాలొచ్చినా పంపిణీ చేయడానికి ఎటువంటి అవరోధాలు లేవు. రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ మార్గనిర్దేశం చేస్తోంది. ప్రతి దశలోనూ సాంకేతిక సమస్యలను అధిగమించడానికి సాంకేతిక కమిటీనీ ప్రభుత్వం నెలకొల్పింది. పరికరాల నిల్వకు కూడా ఒక నిపుణుల కమిటీ ఉంది. ఈ కమిటీల సూచనలతో ముందుకెళ్తున్నాం.
టీకాల కేంద్రాల్లో ఎటువంటి ఏర్పాట్లు చేశారు
రాష్ట్రంలో 10 వేల కేంద్రాల్లో టీకాలను అందించడానికి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అందుకు తగ్గట్లుగా ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, పాఠశాలలు, సామాజిక భవనాలను సిద్ధం చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి ఈ కేంద్రాలకు ప్రత్యేక శీతల పెట్టెల్లో టీకాలను తరలిస్తారు. ప్రతి టీకా కేంద్రంలోనూ 3 గదులుండేలా చర్యలు చేపట్టారు. టీకాలిచ్చే క్రమంలో ఎటువంటి దుష్ఫలితాలు వచ్చినా.. వెంటనే చికిత్స అందించేందుకు 14 రకాల ఔషధాలు, పరికరాలతో కూడిన కిట్‌ను అందుబాటులో ఉంచనున్నాం. తాగునీరు, విద్యుత్ సరఫరా, శానిటైజర్లు మాస్కులు, గ్లౌజులు, 50 లక్షల సిరంజీలు, 50 వేల టీకాలను తెరిచే పరికరాలు, తదితరాలన్నింటినీ ఇప్పటికే సిద్ధం చేశాం.
టీకా నిల్వ కేంద్రాల్లో ఉష్ణోగ్రతను ఎలా పరిశీలిస్తారు?