ప్రశ్న :వర్షాకాల నేపథ్యంలో విద్యుత్ శాఖ ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకుంటుంది..?
జవాబు (రఘుమారెడ్డి, ఎస్పీడీసీఎల్ సీఎండీ ) : గత అనుభవాల నేపథ్యంలో ప్రతి సబ్ స్టేషన్, సెక్షన్ కార్యాలయంలో 20 నుంచి 30 విద్యుత్ స్తంభాలను అందుబాటులో ఉంచాం. మానవవనరులను కూడా అందుబాటులో ఉంచాం. ప్రతి డివిజన్లో 20 మంది స్టాఫ్‌ను 24 గంటల పాటు పనిచేసేవిధంగా ఏర్పాటు చేశాం. వీటికి అధనంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంలను ఏర్పాటు చేశాం. ఈ బృందంలో ఇంజినీర్లు కూడా ఉంటారు. వారు ఎక్కువ వరదలు, వర్షాలు వచ్చినప్పుడు.. ఎప్పటికప్పుడు తక్షణమే సొంత వాహనాల్లో స్థానిక సర్కిల్ కార్యాలయానికి వెళ్లి... అక్కడి నుంచి అవసరమైన ప్రాంతానికి చేరుకుంటారు. అందుకోసం వాళ్లకు వాహనాలు కూడా సమకూర్చుతాం. వీరితో పాటు కాంట్రాక్టర్ల వద్ద పనిచేసే వారిని, ఇతర ఏజెన్సీలతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మాసాలకు ఇందుకోసం ప్రత్యేక అనుమతులు ఇచ్చాం.
ప్రశ్న:గతేడాది వరదలు, వర్షాలతో అపార్ట్మెంట్ వాసులు భారీ వర్షాలతో రోజుల తరబడి విద్యుత్ లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత అనుభవాల దృష్ట్యా వారికి ఎటువంటి సలహాలు, సూచనలు ఇస్తున్నారు...?
జవాబు : గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి అపార్ట్మెంట్లోని వినియోగదారుడి వద్దకు వెళ్లాం. అక్కడి పరిస్థితులను స్వయంగా తెలుసుకున్నాం. సెల్లార్లో ఉన్న మీటర్ బోర్డులను మార్చుకోవాలని విజ్ఞప్తి చేశాం. 60శాతం మంది అపార్ట్మెంట్ వాసులు సెల్లార్ నుంచి మొదటి అంతస్తులోకి విద్యుత్ బోర్డులను మార్చుకున్నారు. మిగిలిన వాటిని ఈ ఏడాది అక్టోబర్ నాటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం.
ప్రశ్న:వర్షాలు, వరదల వల్ల విద్యుత్ స్తంభాలు కొట్టుకుపోవడం, విరిగిపోవడం వంటివి జరుగుతుంటాయి. ఇలాంటి సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం జరగకుండా ఎటువంటి జాగ్రతలు తీసుకుంటున్నారు?
జవాబు: గతేడాది సెప్టెంబర్‌లో భారీ వర్షాలతో మూసీ పరివాహక ప్రాంతంలో సుమారు 1,500ల ట్రాన్స్ ఫార్మర్లు కొట్టుకుపోయాయి. తిరిగి వాటిని ఏర్పాటు చేసే సమయంలో వీలైనంత ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు చేశాం. అందువల్ల ఈసారి వరదలు వచ్చినా... ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వలేదు. ఈసారి వర్షాలు, వరదలతో మూసీ గేట్లు ఎత్తినప్పటికీ ఇబ్బందులు తలెత్తలేదు. ట్రాన్స్ఫార్మర్లను లైన్లతో సహా ఎత్తైన ప్రదేశానికి షిప్ట్ చేశాం. ఇక ఈసారి వర్షాలు, వరదలకు గ్రామీణ జిల్లాలు, సర్కిళ్ల పరిధిలో 13 విద్యుత్ స్తంభాలు నేలకొరగటంతో పాటు... అయిదు డిస్ట్రీబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి.
ప్రశ్న: మరో మూడు నాలుగేళ్లలో స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలని కేంద్రం పేర్కొంది. వాటివల్ల డిస్కంలకు ఆర్థిక భారమవుతుందని భావిస్తున్నారా...?
జవాబు: ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశాం. ఇప్పటికీ ఒక్క స్మార్ట్ మీటర్ పెట్టని రాష్ట్రాలు కూడా కొన్ని ఉన్నాయి. అటువంటి రాష్ట్రాల్లో ప్రీపెయిడ్మోడ్లో అడ్వాన్స్ చెల్లింపులు జరిగితే బాగుంటుందని సూచన చేశారు. అది మంచి నిర్ణయమే. డిస్కంలకు వినియోగదారులు సరైన సమయంలో బిల్లులు చెల్లించడంలేదు. దానివల్ల డిస్కంలకు కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముందే చెల్లిస్తే విద్యుత్ సంస్థలకు వెసులుబాటు ఉంటుంది. అన్ని మీటర్లను ప్రీపెయిడ్ మోడ్ లో చేయడం ఖర్చుతో కూడుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటుకు రూ.11,500ల కోట్ల నిధులు అవసరమవుతాయి. కాబట్టి కేంద్రం ఏదైనా స్కీం తీసుకొచ్చి.. తద్వారా 80శాతం నుంచి 90శాతం వరకు గ్రాంట్ ఇస్తే.. డిస్కంలకు ఆర్థికంగా భారం కాకుండా ఉంటుంది.