కరోనా ప్రభావం వల్ల ఇప్పటికే కొన్ని ఐటీ కంపెనీలు ఆర్థిక భారాన్ని తగ్గించుకునే చర్యలు చేపట్టాయని, పదోన్నతులు వాయిదా వేసుకున్నాయని హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు మురళి బొల్లు తెలిపారు. ప్రస్తుతానికి ఐటీలో ఐదు శాతం లోపు ఉద్యోగాల కోత ఉండే అవకాశాలున్నాయని, కొవిడ్ ప్రభావం కొనసాగుతూ వెళ్తే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని వెల్లడించారు.
కరోనా ప్రభావాన్ని ఐటీ కంపెనీలు ఎలా ఎదుర్కొంటున్నాయి?
లాక్‌డౌన్‌తో ఐటీరంగంలో తొలిసారిగా 90-95 శాతం మంది ఉద్యోగులు రెండు వారాలుగా ఇంటి నుంచి పనిచేస్తున్నారు. ఐదుశాతం మంది కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసేందుకు కంపెనీలు అవసరమైన ఏర్పాట్లన్నీ చేశాయి. పలు కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు కసరత్తు మొదలుపెట్టాయి. ఉద్యోగులకు పదోన్నతులు, వేతన పెంపు నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశాయి.
‘ఇంటి నుంచి పని’ విధానంలో ఏమైనా సమస్యలు గుర్తించారా?
ఇంట్లో కూర్చునే సీటు సరిగా లేకపోవడంతో పలువురు ఉద్యోగులు వెన్నునొప్పి సమస్య ఎదుర్కొంటూ సెలవులు అడుగుతున్నట్లు గుర్తించాం. పలు పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించడంతో ఇంట్లో ఇంటర్నెట్ వాడకం పెరిగింది. ఈ పరిస్థితితో ఒక్కోసారి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఆన్‌లైన్ సమావేశాలకు అప్పుడప్పుడు ఇంట్లో పిల్లలు, ఇతరుల మాటలు అంతరాయం కలిగిస్తున్నాయి. ప్రస్తుతానికి క్లయింట్లు పరిస్థితులు అర్థం చేసుకుని సావధానంగా ఉన్నా, సహనం కోల్పోతే సమస్యలు తప్పవు.