పత్తి సాగులో మన ప్రధాన సమస్య ఏమిటి?
మనదేశంలో ఎన్నో అనుకూలతలు ఉన్నా పత్తిలో ప్రపంచ నాయకత్వం వైపుగా వెళ్లే పరిస్థితి కన్పించడంలేదు. మన పత్తిలో ఫైబర్ దిగుబడి 13 ఏళ్లుగా హెక్టారుకు 500 కిలోలు మాత్రం ఉంది. ఇందులో అంతర్జాతీయంగా మనం 34వ స్థానంలో ఉన్నాం. చైనా, మెక్సికోల్లో సుమారు 1700 కిలోలు ఉండగా బ్రెజిల్‌లో 1800, ఆస్ట్రేలియాలో 2200 నుంచి 2500 కిలోలదాకా ఉంది. పత్తి సాగులో ఖర్చులు తగ్గి దిగుబడి పెరగాలి. నాణ్యత దెబ్బతినడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో రాయితీ ధరలతో అమ్మాల్సి వస్తోంది. ఫైబర్ ఎక్కువగా ఉండి అన్ని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పండే స్వదేశీ పత్తి వంగడాలను అభివృద్ధి చేసేలా మరిన్ని పరిశోధనలు జరగాలి.
సాగు విధానంలో ఎలాంటి మార్పులు అవసరం?
పత్తిసాగుకు సంబంధించిన ఇతర దేశాల్లో మొక్కల సాంద్రత ఎక్కువగా ఉంది. హైడెన్సిటీ ప్లాంటింగ్ విధానం రావాలి. పది సెంటీమీటర్లకు ఒక మొక్క ఉండాలి. లేదంటే ఏ సాంకేతికత వచ్చినా దిగుబడి పెరగదు. ఖర్చెక్కువ అని దీనికి దూరంగా ఉంటే దిగుబడిపై ప్రభావం కొనసాగుతుంది.
ఏపీలో కొత్తగా గుర్తించిన ఫాల్ ఆర్మీ వర్మ్ గురించి చెప్పండి?
ఫాల్ ఆర్మీ వర్మ్ కొత్త పురుగు. మనదేశంలో ఉండేది కాదు. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో ఇది కనబడింది. ఇది బీటీ పత్తిని కూడా తింటుంది. పత్తికాయల్ని, కొమ్మల్ని కూడా తినేస్తుంది. శాస్త్రవేత్తలు అప్రమత్తం కావాలి. ముందే దీన్ని ఆపగలిగితే మరిన్ని సమస్యలకు దారి తీయకుండా ఉంటుంది.
విత్తనాల సమస్య... స్వదేశీ వంగడాల ఆవశ్యకత ఎలా ఉంది?
2001లో మన దేశంలో 60 శాతం దేశీయ పత్తి సాగవగా 40 శాతం హైబ్రిడ్ రకం ఉండేది. ఇప్పుడు మొత్తం హైబ్రిడ్ విత్తనాలనే వాడుతున్నారు.ఏటా ఏదో ఒక కొత్త రకం వస్తుండటం రైతులను గందరగోళపరుస్తోంది. ఇరవై ఏళ్లలో రెండు, మూడువేల రకాలు వచ్చాయి. ఏ దేశంలోనూ ఈ పరిస్థితి లేదు. పూర్తిగా హైబ్రిడ్ బీటీ కాకుండా స్వదేశీ పత్తి కూడా ఉండాలి. దేశీ పత్తిలో ఫైబర్ ఎక్కువ వచ్చేలా సీఐసీఆర్ ఆరు బీటీ వంగడాలు తీసుకువచ్చింది. ఇవి ఇతర బీటీ విత్తనాలకంటే మెరుగ్గా ఉన్నాయి.
పత్తి ఏరివేతకు కూలీల సమస్య ఉంది. దీనికి పరిష్కారం?
మనం కూడా యంత్రాల వినియోగంపై దృష్టిసారించాలి. ప్రస్తుతానికి ఇది వ్యయంతో కూడుకుని ఉంది. నాగపుర్‌లోని సీఐసీఆర్ ప్రయోగాత్మకంగా యంత్రాలను రూపొందించింది. తక్కువ ఖర్చుతో చిన్న యంత్రాలను అందుబాటులోకి తీసుకురావాలి. వాటి వినియోగానికి వీలుగా సాగు పద్ధతిలో కూడా మార్పులు రావాలి.
కలుపు నివారించే హెచ్‌టీ బీటీ విత్తనాల వినియోగంలో సమస్య ఏమిటి?
కలుపు సమస్యకు పరిష్కారమని హెచ్‌టీ బీటీ విత్తనాలు వాడటం సరికాదు. అనధికారంగా అక్కడక్కడ వాడుతున్నారు. ఈ జన్యువును బయటనుంచి తెచ్చారు. భారత ప్రభుత్వం దీన్ని పరీక్షించి సురక్షితమని చెప్పలేదు.
ఇదీ చూడండి:పత్తి పంటకు పరిశ్రమ తోడైతేనే భవిత