world cancer day: గిరీష్ (46) ప్రభుత్వోద్యోగి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు. మద్యం, ధూమపానం వంటి అలవాట్లేమీ లేవు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తున్నా.. ఆయన రక్త క్యాన్సర్ బారినపడ్డారు. వైద్యనిపుణులు కుటుంబచరిత్రను ఆరా తీయగా.. గిరీష్ మేనమామ కూడా క్యాన్సర్‌తోనే మృతిచెందినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో వైద్యులు కొన్ని జన్యుపరమైన పరీక్షలు చేయించగా.. అందులో ప్రమాదకరమైన మార్పులకు లోనయ్యే జన్యువులు బయటపడ్డాయి. క్యాన్సర్ కుటుంబ చరిత్ర ఉన్న వారిలో ఈ ప్రమాదకరమైన జన్యువులుంటే.. వారిలో మహమ్మారి ముప్పు అధికమని వైద్యులు వెల్లడించారు.
తెలంగాణలో క్యాన్సర్ విజృంభిస్తోంది. గత మూడేళ్లలో కొత్త కేసుల సంఖ్య మరణాలు కూడా పెరుగుతుండడం మహమ్మారి తీవ్రతకు నిదర్శనం.
2020లో 47,620 కొత్త కేసులు నమోదు కాగా.. 2021లో 48,775.. 2022లో 49,983 నిర్ధారణ అయ్యాయి. 2020లో క్యాన్సర్ కారణంగా 26,038 మంది మృతి చెందగా.. 2021లో 26,681, 2022లో 27,339 మంది బలయ్యారు. క్యాన్సర్ బారినపడడానికి కారణాలు అనేకమున్నా.. అత్యధికం స్వీయ తప్పిదాల వల్ల వచ్చేవేనని నిపుణులు చెబుతున్నారు. జీవనశైలిని, దురలవాట్లను అదుపులో పెట్టుకుంటే.. చాలావరకు క్యాన్సర్లు రాకుండా జాగ్రత్తపడొచ్చు. ఆరోగ్యకరమైన జీవితం గడుపుతున్నా.. వంశపారంపర్యంగా సుమారు 10 శాతం మందిలో క్యాన్సర్ అనూహ్యంగా వెన్నాడుతోంది.
కుటుంబంలో ఒక వ్యక్తి తాత, నాయనమ్మ, మేనత్త, మేనమామ, అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు.. ఇలా సమీప రక్తసంబంధీకుల్లో ఎవరికి క్యాన్సర్ వచ్చిన చరిత్ర ఉన్నా, ఆ వ్యక్తికి ముప్పు పొంచి ఉన్నట్టేనని చెబుతున్నారు ఏఐజీకి చెందిన క్యాన్సర్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ప్రజ్ఞ చిగురుపాటి. మహమ్మారి సోకే అవకాశాలను తొలిదశలోనే గుర్తిస్తే చికిత్స సులభమని, నయమయ్యే అవకాశాలు 95 శాతానికి పైగా ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. ఈ నెల 4న ‘ప్రపంచ క్యాన్సర్ నివారణ దినం’ సందర్భంగా ‘ఈనాడు’తో ముఖాముఖిలో పలు అంశాలు వెల్లడించారు. వివరాలు ఆమె మాటల్లోనే..
జీవనశైలితో ముడిపడినవే ఎక్కువ:పొగాకు ఉత్పత్తుల వాడకం, హానికారక రసాయనాలను పీల్చడం, మద్యపానం, వేపుళ్లు, నూనె పదార్థాలు ఎక్కువగా తినడం, రేడియేషన్‌కు లోనవడం, ఊబకాయం, అరక్షిత శృంగారం, ఇవన్నీ జీవనశైలి అలవాట్ల కిందికే వస్తాయి. వీటిని మార్చుకోవడం ద్వారా క్యాన్సర్ నుంచి రక్షణ పొందొచ్చు. ఇవి కాకుండా.. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు ప్రత్యేక కారణాలున్నాయి. ‘హ్యూమన్ పాపిలోమా వైరస్ ’ ద్వారా ఈ క్యాన్సర్ సోకుతుంది. మర్మావయవాల పరిశుభ్రత పాటించకపోవడం, పదే పదే సుఖవ్యాధులు సోకడం, పౌష్టికాహారం లోపించడం, 18 ఏళ్ల లోపే పెళ్లయి పిల్లలు పుట్టడం వంటివి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చే అవకాశాలుంటాయి. అత్యధికంగా నమోదయ్యే రొమ్ము క్యాన్సర్ కారణాలు కూడా భిన్నంగా ఉన్నాయి. ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం, 35 ఏళ్లు దాటాక గర్భధారణ, పిల్లలు లేకపోవడం, తల్లిపాలు బిడ్డకు పట్టకపోవడం, జన్యుపరంగా కూడా రొమ్ము క్యాన్సర్ రావడానికి అవకాశాలున్నాయి. చాలామంది మహిళల్లో ఈ విషయాలపై అవగాహన ఉండట్లేదు. వీటన్నిటితో పాటు కుటుంబ చరిత్ర కూడా చాలా ముఖ్యమైంది.
ప్రతి తొమ్మిది మందిలో ఒకరు: జాతీయ క్యాన్సర్ రిజిస్ట్రీ గణాంకాలు, విశ్లేషణ ప్రకారం.. భారత్‌లో 2022లో 14,61,427 కేసులున్నాయి. ప్రతి తొమ్మిది మందిలో ఒకరు తమ జీవితకాలంలో ఏదో ఒక క్యాన్సర్ బారిన పడుతున్నారు. పురుషులు, మహిళల్లోనూ రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్లు అధికంగా నమోదవుతున్నాయి. 14 ఏళ్ల లోపు పిల్లల్లో లింఫోయిడ్ లుకేమియా ఎక్కువగా కనిపిస్తోంది. 2020తో పోల్చితే 2025 నాటికి క్యాన్సర్ కేసులు 12.8 శాతం పెరిగే అవకాశాలున్నాయని, 75 ఏళ్ల లోపు క్యాన్సర్ బారినపడే అవకాశాలు పురుషుల్లో 12.6 శాతం, మహిళల్లో 8.9 శాతం అని క్యాన్సర్ రిజిస్ట్రీ అంచనా.