తెలంగాణ

telangana

ETV Bharat / state

మాస్క్ లేకుంటే అక్కడ 100 పౌండ్ల జరిమానా!

మాస్క్‌ పెట్టుకోకపోతే బ్రిటన్‌లో 100 పౌండ్లు జరిమానా విధిస్తున్నారు. కరోనా ధాటికి ఒక దశలో ఆ దేశం చిగురుటాకులా వణికింది. ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వైరస్‌ బారినపడ్డారు. మరణాల శాతం అత్యధికంగా నమోదైన దేశాల్లో బ్రిటన్‌ ఒకటి. ఆ తర్వాత అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల కరోనా నియంత్రణలోకి వచ్చింది. బ్రిటన్‌లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యుల్లో గుడారు కల్యాణ్‌ ఒకరు. ‘యూనివర్సిటీ హాస్పిటల్స్‌ ఆఫ్‌ నార్త్‌ మిడ్‌లాండ్స్‌’లో యూరాలజిస్ట్‌గా పనిచేస్తున్న ఆయన కరోనా రోగులకు చికిత్స చేసే క్రమంలో వైరస్‌ బారినపడ్డారు. కోలుకుని మళ్లీ విధులకు హాజరవుతున్నారు. బ్రిటన్‌లోని పరిణామాల్ని దగ్గరగా పరిశీలిస్తున్న ఒక వైద్యుడిగా, కరోనా బారినపడి కోలుకున్న వ్యక్తిగా తన అనుభవాల్ని ‘ఈనాడు, ఈటీవీ భారత్’కు ఫోన్‌ ఇంటర్వ్యూలో వివరించారు.

మాస్క్ లేకుంటే అక్కడ 100 పౌండ్ల జరిమానా!
మాస్క్ లేకుంటే అక్కడ 100 పౌండ్ల జరిమానా!

By

Published : Jul 29, 2020, 2:29 PM IST

నా వయసు 34 ఏళ్లు. ఏప్రిల్‌ 30న నాకు పొడి దగ్గు, జ్వరం, నీరసం మొదలయ్యాయి. వెంటనే ప్రత్యేక గదిలోకి వెళ్లిపోయాను. మొదటి ఐదు రోజులు చాలా ఇబ్బంది పడ్డాను. జ్వరం 9 రోజులు ఉంది.

ఆయాసం లేదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేశాను. రోజుకు 12-14 గంటలు నిద్రపోయేవాడిని. మే 14కు బాగా కోలుకున్నాను. పారాసిటమాల్‌, మల్టీ విటమిన్‌ టాబ్లెట్‌లు వేసుకున్నాను. రోజుకు రెండు మూడు గుడ్లు తినేవాడిని. సూప్‌లు తాగేవాడిని. శరీరానికి తక్షణ శక్తి అవసరం కాబట్టి ఆహారంలో పిండిపదార్థాలూ తీసుకునేవాడిని. ఇప్పుడు నా శరీరంలో ‘ప్రొటెక్టివ్‌ యాంటీబాడీలు’ అభివృద్ధి చెందాయి. త్వరలో ప్లాస్మా దానం చేయాలనుకుంటున్నాను.

దగ్గు, జ్వరమే ఉంటే ఆందోళన వద్దు..

కరోనా సోకినవారిలో జ్వరం, దగ్గు మాత్రమే ఉంటే ఆందోళన చెందాల్సిన పని లేదు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుంటే వెంటనే అప్రమత్తం కావాలి. కరోనా సోకినవారిలో... ఓ మాదిరి లక్షణాలు ఉన్నవారికీ కోలుకోవడానికి 10-14 రోజులు పడుతుంది. బ్రిటన్‌లో వ్యాధి నిర్ధారణకు ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలే చేస్తున్నారు. ఇక్కడ కరోనా సోకిన 60-70 శాతం మందిలో ఓ మాదిరి లక్షణాలే ఉంటున్నాయి. వారిని ఆసుపత్రులకే రావొద్దంటున్నారు. వారు నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌) హెల్ప్‌లైన్‌కి ఫోన్‌ చేస్తే... చికిత్స గురించిన వివరాల్ని చెబుతారు.

వృద్ధులు ఎక్కువ కనుకే మరణాలు..

బ్రిటన్‌లో ఆలస్యంగా లాక్‌డౌన్‌ పెట్టారు. జనవరి 30న మొదటి కేసు నమోదైతే, మార్చి 28 నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. పైగా వివిధ దేశాలతో బ్రిటన్‌కు అనుసంధానం ఎక్కువ. నిత్యం రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. దాని వల్ల కరోనా వేగంగా వ్యాప్తి చెందింది. బ్రిటన్‌లో సగటు జీవితకాలం 82 ఏళ్లు. ఇక్కడ వృద్ధులు ఎక్కువ... వారిలో రోగనిరోధక శక్తి తక్కువ కాబట్టి, మరణాలు అధికంగా ఉన్నాయి. రోగ లక్షణాలున్నవారిని గుర్తించడం, వారిని వేరు చేసి చికిత్సనందించడంపై అధికారులు ఎక్కువ దృష్టి పెట్టారు.

విద్యా సంస్థల్ని మూసివేయడం, ఇంటి నుంచే పనిని ప్రోత్సహించడం, ఎక్కువ మంది ఒక చోట గుమిగూడకుండా నిరోధించడం వల్ల వ్యాప్తిని నియంత్రించారు. పరీక్షల్ని బాగా పెంచారు. ఇక్కడ ప్రభుత్వం ప్రతి రోజూ ప్రజలకు విధివిధానాల్ని చెబుతుంది. వాటిని జనం కచ్చితంగా పాటిస్తారు. భౌతికదూరం, మాస్క్‌లు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటివి బాధ్యతగా నిర్వర్తిస్తారు. ఏమాత్రం రోగ లక్షణాలు కనిపించినా ఎన్‌హెచ్‌ఎస్‌కి ఫోన్‌ చేస్తారు. ఎవరిలో వ్యాధి లక్షణాలు కనిపించినా ఒక్క రోజులోనే పరీక్ష చేసి, ఫలితం చెబుతున్నారు.

‘సోషల్‌ బబుల్‌’తో సత్ఫలితాలు..

ప్రస్తుత పరిస్థితిని చెప్పడానికి ఇక్కడ ‘న్యూ నార్మల్‌’ అనే పదం వాడుతున్నారు. రోగులకు ఫోన్‌లు, వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా వైద్యులు చికిత్స చేస్తున్నారు. మాస్క్‌ వేసుకోకపోతే 100 పౌండ్లు జరిమానా వేస్తున్నారు. అది సుమారు రూ.10 వేలతో సమానం. సోషల్‌ బబుల్‌ అనే విధానం అమల్లోకి తెచ్చారు. జనం పెద్దఎత్తున కలవడాన్ని ఆమోదించడం లేదు గానీ స్నేహితులు, సన్నిహితుల కుటుంబాలు మూడు వరకు... కలసి పార్కులు వంటి ప్రదేశాలకు వెళ్లవచ్చు. కలసి చిన్న చిన్న పార్టీలు చేసుకోవచ్చు. ఆ మూడు కుటుంబాల్నీ కలిపి ఒక బబుల్‌గా పరిగణిస్తారు. వారిలో ఎవరికైనా పాజిటివ్‌ వస్తే... మిగతావారికీ పరీక్షలు చేస్తారు. ఇక్కడ ప్రైవేటు ఆసుపత్రులు చాలా తక్కువ. ఆసుపత్రులన్నీ ఎన్‌హెచ్‌ఎస్‌ ఆధ్వర్యంలోనే పనిచేస్తాయి. అందరికీ ఉచితంగా, నాణ్యమైన చికిత్స అందుతుంది.

హెర్డ్‌ ఇమ్యూనిటీ పరిష్కారం కాదు..

ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఎక్కువ శాతం జనాభాలో వ్యాధితో పోరాడే శక్తి ఏర్పడితే దాన్ని హెర్డ్‌ ఇమ్యూనిటీ అంటారు. అది... వ్యాక్సిన్‌ వల్లనైనా రావాలి... ఎక్కువ మందికి వైరస్‌ సోకడం వల్లనైనా వ్యాధి నిరోధకశక్తి పెరగాలి. హెర్డ్‌ ఇమ్యూనిటీ రావాలంటే... 70-80 శాతం మందికి వైరస్‌ సోకాలి. అంత మందికి వైరస్‌ సోకితే... వారికి చికిత్స అందించేంత సామర్థ్యం మన వైద్య, ఆరోగ్య వ్యవస్థలకు లేవు. కాబట్టి హెర్డ్‌ ఇమ్యూనిటీ ఈ సమస్యకు పరిష్కారమని అనుకోవడం లేదు.

భారత్‌లో ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి. రాబోయేది శీతాకాలం. సీఓపీడీ, ఆస్తమా వంటి సమస్యలు పెరుగుతాయి. ఈ సీజన్‌లో సాధారణంగా వచ్చే ఫ్లూలకు ముందే వ్యాక్సిన్‌ తీసుకోవడం మంచిది. భారత జనాభాలో 44 శాతం మంది 24 ఏళ్లలోపు వయసువారు. అందుకే కరోనా మరణాల రేటు తక్కువగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details