తెలంగాణ

telangana

ETV Bharat / state

వచ్చే యాసంగి నుంచి నూతన వ్యవసాయ విధానం - agriculture latest news

రాష్ట్ర సమగ్ర వ్యవసాయ విధాన రూపకల్పనకు ముమ్మర కసరత్తులు చేస్తున్నాం. త్వరలో సీఎం కేసీఆర్‌కు వివరాలు అందజేస్తాం. ప్రభుత్వ ఆమోదం తరువాత వచ్చే అక్టోబరు నుంచి ప్రారంభమయ్యే యాసంగి సీజన్‌ నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తెస్తాం’ అని వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. రుణమాఫీ పథకానికి, పంట రుణాల పంపిణీకి లంకె పెట్టకూడదని, గ్రామీణ ప్రాంతంలో తప్పనిసరిగా పంటరుణాలివ్వాలని బ్యాంకులకు ఆదేశాలున్నాయని మంత్రి వివరించారు. వచ్చే నెల ఒకటి నుంచి కొత్త వానాకాలం పంటల సాగు సీజన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పలు అంశాలపై ఆయన ‘ఈటీవీభారత్​తో మాట్లాడారు.

INTERVIEW WITH AGRICULTURE MINISTER NIRANJAN REDDY IN HYDERABAD
వచ్చే యాసంగి నుంచి నూతన వ్యవసాయ విధానం

By

Published : May 9, 2020, 7:05 AM IST

  • వచ్చే వానాకాలం సీజన్‌లో పంటల మార్పిడి విధానం ఏమైనా తెస్తున్నారా?
  • ఈ ఏడాది రికార్డుస్థాయిలో కోటీ 35 లక్షల ఎకరాల్లో పంట సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా. గతేడాది కన్నా 13 లక్షల ఎకరాలు అదనం. దీంట్లో దాదాపు 10 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని భావిస్తున్నాం. పంటల మార్పిడి విధానాన్ని వచ్చే యాసంగి సీజన్‌లో అమలుచేస్తాం.
  • అధికంగా వచ్చే ధాన్యం మొత్తాన్ని మద్దతు ధరకు కొనడం సాధ్యమా? కొంటారా?
  • కొత్త వ్యవసాయ విధానం దీనిపై దృష్టి పెడుతోంది. ఏటా ప్రపంచం, దేశంలో ఎక్కడ వరికి అధిక డిమాండు ఉంటుందో గుర్తించి.. ఆయా ప్రాంతాల్లో అమ్మేలా మార్కెటింగ్‌ విధానాన్ని బలోపేతం చేస్తాం. రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం రాష్ట్రాల చేతిలో ఉంది. మద్దతు ధర నిర్ణయాధికారం కూడా రాష్ట్రాలకు ఉండాలి. ఇప్పుడు కేంద్రం సొంతంగా నిర్ణయిస్తోంది.
  • రైతులు ప్రధాన పంటలు కాకుండా ఇతర పంటలు సాగు చేసేలా ప్రణాళిక ఉందా?
  • ఇందుకోసం భారీ కసరత్తులు చేస్తున్నాం. వచ్చే యాసంగి నుంచి క్షేత్రస్థాయిలో అమలుచేయాలని నిర్ణయించాం. రాష్ట్ర ప్రజల ఆహార అవసరాలు తీర్చడంతో పాటు ప్రపంచ మార్కెట్‌లో డిమాండు ఉన్న పంటల సాగును ప్రోత్సహిస్తాం. ప్రభుత్వం చెప్పినవి కాకుండా ఇతర పంటలు వేసుకుంటే.. అమ్ముకునే బాధ్యత రైతులదే అని ముందే హెచ్చరిస్తాం. ఎక్కడ ఏ పంట బాగా పండుతుందో ప్రాంతాలవారీగా గుర్తించి ప్రోత్సహిస్తాం. ఉదాహరణకు కరీంనగర్‌లో మొక్కజొన్న సాగుచేస్తే అధిక నాణ్యమైన దిగుబడి వస్తుంది. అదే పంట మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో సాగుచేస్తే అంతగా దిగుబడి రాదు.
  • ఏఏ పంటలను కొత్తగా సాగులోకి తేవాలనేది ప్రభుత్వ ఆలోచన?
  • ప్రజల ఆహార అవసరాలు తీరేలా ప్రస్తుతం అన్ని పంటలు పండటం లేదు. మనం ఇతర దేశాల నుంచి కోటిన్నర టన్నుల వంటనూనెలను దిగుమతి చేసుకుంటున్నాం. ఈ కొరత తీర్చేందుకు తెలంగాణలో ఆయిల్‌పాం, నువ్వులు, వేరుసెనగ, ఆవాల సాగు పెంచాలని నిర్ణయించాం. కొరత ఉన్న కూరగాయల పంటల సాగును కూడా పెంచబోతున్నాం.
  • దిగుబడులు తగ్గట్లు రైతులకు ఆదాయం పెరగడం లేదు కదా?
  • పండ్లు, కూరగాయలు, పాలఉత్పత్తిలో ప్రపంచంలోనే మనదేశం అగ్రస్థానంలో ఉంది. కానీ ఇక్కడ కూడా అవి ప్రజలందరికీ దొరకడం లేదు. ప్రజల వినియోగంలో సమతుల్యత లేదు. ప్రపంచ ఎగుమతుల్లో మనదేశం వాటా 2 శాతమే. ఇది పెరగాలంటే విలువ ఆధారిత ఉత్పత్తులు పెరగాలి. ఇందుకు ఆహార శుద్ధి పరిశ్రమలను పెద్దయెత్తున ఏర్పాటుచేయాలి.
  • ఆహారశుద్ధి రంగానికి ఏం చేయబోతున్నారు.. పరిశ్రమలు ఎప్పటికి వస్తాయి ?
  • ప్రస్తుతం ఈ అంశంపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తోంది. త్వరలో నివేదిక ఇస్తుంది. దాని ఆధారంగా ఆహారశుద్ధి పరిశ్రమలను ఏర్పాటుచేయిస్తాం. ఇప్పటికే 50 వరకు పెద్ద కంపెనీలు ఆసక్తి చూపుతూ దరఖాస్తు చేశాయి. కొత్త విధానం వచ్చాక వీటి ఏర్పాటుకు అనుమతిస్తాం.
  • ఈ సీజన్‌ నుంచి కేంద్రం పంటలబీమాను రైతుల ఇష్టానికే వదిలేసింది. దీనివల్ల ఎక్కువ మంది పంటలబీమాకు దూరమయ్యే ప్రమాదం లేదా?
  • కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎక్కువ మంది రైతులు పంటల బీమాకు దూరమవుతారు. ప్రతి రైతు పంటకు కేంద్రమే సొంతంగా బీమా చేయించాలనేది మా డిమాండు. దీనివల్ల విపత్తుల సమయంలో రైతులకు పరిహారం అందుతుంది.
  • గోదాముల కొరత తీవ్రంగా ఉంది కదా?
  • ఈ సమస్యను అధిగమించడానికి వెంటనే 40 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం గల కొత్త గోదాముల నిర్మాణానికి సీఎం అనుమతించారు. జిల్లాల్లో భూములను గుర్తిస్తున్నాం. వీటిని సేకరించగానే నాబార్డు నుంచి రుణం తీసుకుని వెంటనే నిర్మాణ పనులు ప్రారంభిస్తాం.

ABOUT THE AUTHOR

...view details