తెలంగాణ

telangana

ETV Bharat / state

Aam Aadmi Party: 'ధాన్యం కొనుగోలుపై భాజపా-తెరాస మ్యాచ్‌ ఫిక్సింగ్‌' - హైదరాబాద్ తాజా వార్తలు

Aam Aadmi Party: దేశమంతటా తమ పార్టీని విస్తరిస్తామని.. అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తామని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) దక్షిణాది రాష్ట్రాల ఇన్‌ఛార్జి, దిల్లీ మాల్‌వీయనగర్‌ ఎమ్మెల్యే సోమ్‌నాథ్‌ భారతి అన్నారు. అభివృద్ధిలో ‘గుజరాత్‌ నమూనా’ విఫలమైందని.. దిల్లీ-కేజ్రీవాల్‌ మోడలే ఆశాకిరణమని వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యే సోమ్‌నాథ్‌ భారతి
MLA Somnath Bharti

By

Published : Apr 11, 2022, 8:13 AM IST

Aam Aadmi Party: అభివృద్ధిలో ‘గుజరాత్‌ నమూనా’ విఫలమైందని.. దిల్లీ-కేజ్రీవాల్‌ మోడలే ఆశాకిరణమని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) దక్షిణాది రాష్ట్రాల ఇన్‌ఛార్జి, దిల్లీ మాల్‌వీయనగర్‌ ఎమ్మెల్యే సోమ్‌నాథ్‌ భారతి వ్యాఖ్యానించారు. దేశమంతటా తమ పార్టీని విస్తరిస్తామని.. అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తామని అన్నారు. మతం, కులం, ప్రాంతం ఆధారంగా ఓట్ల రాజకీయాలకు ఆప్‌ వ్యతిరేకమని పేర్కొన్నారు. ఆర్థిక భారం కాకుండా.. ప్రజల ప్రాథమిక అవసరాలు తీరడమే తమ విధానమని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో ఆప్‌ని ఇంటింటికీ తీసుకువెళతామని వివరించారు.

‘‘భాజపా, తెరాస ప్రభుత్వాలు తెలంగాణలో ధాన్యం విషయంలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ రాజకీయాలు చేస్తున్నాయి. రైతుల సమస్యను పట్టించుకోకుండా దోబూచులాడుతున్నాయి. కావాలనే ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ ప్రజలను మోసగిస్తున్నాయి’’ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ వచ్చిన ఆయన ‘ఈనాడు’కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

దిల్లీ, పంజాబ్‌లలో అధికారంలో ఉన్న ఆప్‌ తదుపరి లక్ష్యాలేంటి

గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌లపై ప్రత్యేకదృష్టి పెట్టాం. ఆ తర్వాత మా లక్ష్యంలో హరియాణా, తెలంగాణ ఉన్నాయి. గుజరాత్‌లో మాకు వస్తున్న స్పందనతో భాజపాకు నిద్ర పట్టట్లేదు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఓ ఆప్‌ వాలంటీర్‌ను చేర్చుకోవడానికి ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా చెప్పుకొనే భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వెళ్లారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

దక్షిణాదిలో ఆప్‌కి ఎంతమేర అవకాశాలున్నాయని భావిస్తున్నారు

దక్షిణాది సహా అన్ని రాష్ట్రాల్లో రాజకీయ శూన్యత ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పార్టీలు మతం, కులం, ప్రాంతంపై దృష్టిపెట్టాయి. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. వీటికి అతీతంగా ప్రజలకు కావాల్సిన చదువు, వైద్యం వంటి అంశాలపై దృష్టి పెట్టడమే మా సిద్ధాంతం. అందుకే పంజాబ్‌లో 117కు 92 సీట్లు గెలిచాం. తెలంగాణలో రాజకీయశూన్యత ఉంది. ఆప్‌కి స్పేస్‌ ఉంది. కేంద్రంలో భాజపా ప్రభుత్వ విధానాలు విఫలమయ్యాయి. ద్రవ్యోల్బణం పెరిగింది. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు భారీగా పెరిగాయి. ప్రజలపై ఆర్థికభారం పడుతోంది. దిల్లీలో ఆప్‌ ప్రభుత్వం విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్తుపై అమలుచేస్తున్న పథకాలతో ఒక్కో కుటుంబానికి నెలకు రూ.25 వేల ఖర్చు తగ్గుతోంది.

తెలంగాణపై ఆప్‌ లక్ష్యం ఏంటి

ఈ నెల 14 నుంచి రాష్ట్రంలో మా పార్టీ పాదయాత్ర మొదలవుతుంది. కేజ్రీవాల్‌ మోడల్‌ పరిపాలనను పట్టణాలు, గ్రామాల్లో ఇంటింటికీ తీసుకెళతాం. దిల్లీలో అన్ని రాష్ట్రాల ప్రజలున్నారు. తెలంగాణ వారూ 10 లక్షల మంది ఉంటారు. మా ప్రభుత్వ విధానాలు వారిద్వారా ఇప్పటికే గ్రామాలు, పట్టణాలకు చేరుతున్నాయి. మాది అధికారం కోసం అబద్ధాలు చెప్పే పార్టీ కాదు. దిల్లీలో ఏం చేశామో పంజాబ్‌ ప్రచారంలో కేజ్రీవాల్‌ వివరించారు.

అధికార తెరాస, విపక్ష కాంగ్రెస్‌, భాజపాలను ఎదుర్కొనే బలం ఆప్‌కి ఉందా

తెరాస అవినీతి పార్టీ. దానిని ఎదుర్కోవడంలో కాంగ్రెస్‌ ఏం చేయలేకపోతోంది. జాతీయస్థాయిలోనే కాంగ్రెస్‌ చేతులెత్తేసింది. భాజపా మతతత్వ రాజకీయాలు చేస్తోంది. ఈ మూడు పార్టీలకు భిన్నమైంది ఆప్‌.

తెలుగు రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీ చేస్తారా? పొత్తులు పెట్టుకుంటారా

దశలవారీ వ్యూహాలతో ముందుకు వెళతాం. తొలిదశలో పార్టీని ఇంటింటికీ తీసుకువెళతాం. అవినీతికి, మతతత్వానికి వ్యతిరేకమన్న మా సిద్ధాంతాన్ని ప్రజలకు వివరిస్తాం.

నగర ప్రాంతం దిల్లీ, పట్టణ ప్రాంతాల్లోనే ఆదరణ ఉన్న ఆప్‌.. పెద్ద రాష్ట్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావం చూపగలదా

అది అపోహే. పూర్తిస్థాయి రాష్ట్రం, గ్రామీణ ప్రజలు అధికంగా ఉన్న పంజాబ్‌లోనూ అధికారంలోకి వచ్చాం కదా? ఒకసారి ఆప్‌ విధానాల్ని అర్థం చేసుకున్నవారు పార్టీని విడిచిపెట్టరు.

ఇదీ చదవండి: TRS Protest in Delhi: తెరాస ధాన్యం దంగల్‌.. నేడు దిల్లీలో కేసీఆర్​ దీక్ష

ABOUT THE AUTHOR

...view details