Interstate Thieves Gang In Hyderabad: హైదరాబాద్ అమీర్‌పేట సీత సరోవర్ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ నెంబర్ 202లో నివసించే వ్యాపారి రామ్‌నారాయణ్ ఇంట్లో.. ఈ నెల 3న చోరీ జరిగింది. బీరువాలో దాచిన రూ.50 లక్షల విలువ చేసే ఆభరణాలు మాయమయ్యాయి. వాటితో పాటు కొత్తగా పనిలోకి చేరిన సునీత అనే మహిళ కూడా కనిపించకపోవడంతో బాధితులు ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. చోరీకి పాల్పడిన మహిళతో సహా మరో మహిళను అరెస్ట్ చేశారు.
రూ.50 లక్షల విలువ చేసే బంగారం, వజ్రాలతో: నవీ ముంబయికి చెందిన ముఠాలోని నీతు, పూజ అనే మహిళలు బేగంపేట రైల్వే స్టేషన్‌లో దిగటంతోనే.. పని మనుషులు అవసరమున్న యజమానుల కోసం గాలించారు. ఈ క్రమంలో వ్యాపారి రామ్‌నారాయణ్ వద్ద పని చేసి మానేసిన డ్రైవర్ పూల్‌చంద్ వారికి తారసపడ్డాడు. అతని ద్వారా రామ్ నారాయణ్ ఇంట్లో సునీత, మరో ఇంట్లో పూజ పనిలో చేరారు. యజమానులు ఆధార్ కార్డులను ఇవ్వాలని అడగ్గా.. అవి లేకపోవడంతో పూజను పంపించేశారు. సునీతను మాత్రం కొనసాగించారు. ఈ క్రమంలో బాగా పని చేస్తున్నట్లు యజమానులను నమ్మించిన సునీత.. పనిలో చేరిన రెండు రోజుల్లోనే.. అదను చూసి చోరీకి పాల్పడింది. సుమారు రూ.50 లక్షల విలువ చేసే బంగారు, వజ్రాభరణాలతో ఉడాయించింది.