Interstate Car Thieves Arrest In Hyderabad : ఒకరు దిల్లీలో కారు కొట్టేస్తారు.. మరొకరు దాన్ని కోల్‌కతాకు తీసుకెళ్లి రిజిస్ట్రేషన్, ఛాసిస్ నంబరు చెరిపేసి వేర్వేరు రాష్ట్రాలకు చెందిన రిజిస్ట్రేషన్ నంబర్లు సృష్టిస్తారు. ఇంకొకడు ఇదే వాహనాన్ని రోడ్డు మార్గంలో దర్జాగా హైదరాబాద్(Hyderabad) తీసుకొస్తాడు. ఆ తర్వాత మరో ఏజెంటుకు దాన్ని విక్రయిస్తాడు. ఇదంతా కొట్టేసిన కార్ల(Cars)ను తక్కువ రేటుకు అమ్మేస్తున్న ఒక దొంగల గ్యాంగ్ సృష్టించిన నెట్‌వర్క్. దేశ రాజధానిలో చోరీ చేసిన కార్లను నకిలీ రిజిస్ట్రేషన్లతో ఇతర రాష్ట్రాల్లో తక్కువ రేటుకు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా(Inter State Thieves) రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులకు చిక్కింది. ఈ ముఠాలోని ఏడుగురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.3.3 కోట్ల విలువైన 11 కార్లను స్వాధీనం చేసుకున్నారు.
కోల్‌కతాకు చెందిన బప్పాఘోశ్ ఈ కార్ల చోరీ గ్యాంగ్‌కు లీడర్. కార్లు కొట్టేయడం, వాటికి రిజిస్ట్రేషన్, ఛాసిస్ తొలగించి కొత్త నెంబరు వేయడం, ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు పంపించి విక్రయించేలా వేర్వేరు ముఠాలను తయారు చేశాడు. దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ ఉన్న నిందితుడు దిల్లీ, హర్యానా, సమీపంలోని ఇతర రాష్ట్రాల్లో ఖరీదైన, కొత్త కార్లను చోరీ చేయిస్తాడు. సెంట్రల్ లాకింగ్ వ్యవస్థల్ని అలవోకగా నిర్వీర్యం చేసి.. కోల్‌కతా తీసుకెళ్లి ఇంజిన్ ఛాసిస్ నంబరు, రిజిస్ట్రేషన్, ఇతర ఆధారాలన్నీ చెరిపేస్తారు. ఈ వాహనం తరహాలో ఉండే ఇతర రాష్ట్రాలకు చెందిన కార్ల రిజిస్ట్రేషన్ నంబర్లతో ఆర్‌సీలు తయారు చేసి విక్రయిస్తారు. వీటికి కొత్త సెంట్రల్ లాకింగ్ సిస్టమ్.. దానికి సరిపోయే తాళాలు సహా అన్నీ తయారుచేస్తారు. ఇక ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లోని తన ఏజెంట్లు, కారు డీలర్లుగా పనిచేసే వారిని సంప్రదించి విక్రయిస్తాడు.
Gang Of Interstate Car Thieves In Hyderabad : బప్పాఘోశ్ హైదరాబాద్‌లోని నిజాంపేటకు చెందిన కార్ డీలర్ కడియం శ్రీనివాసరావు, మైలార్‌దేవ్‌పల్లికి చెందిన కార్ డీలర్ మక్కీ ఉర్ రెహ్మాన్‌తో సంబంధం పెట్టుకున్నాడు. కొట్టేసిన మొత్తం 11 కార్లకు తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హరియాణా, అసోం రాష్ట్రాలకు చెందిన రిజిస్ట్రేషన్ నంబర్లు వేయించాడు. తన ఏజెంట్లు, డ్రైవర్లు ద్వారా హైదరాబాద్‌కు కార్లు పంపిస్తాడు. వీటిని శ్రీనివాసరావు, రెహ్మాన్ నగరంలో విక్రయిస్తారు. ఖరీదైన కార్లను కూడా నాలుగైదు రెట్లు తక్కువ ధరకు అమ్ముతారు. నిందితులు రూ.45 లక్షల విలువైన ఫార్చూనర్ కారు(Fortuner Car)ను ఒకరికి రూ.6 లక్షలకు అమ్మినట్లు పోలీసులు గుర్తించారు.
Interstate Car Thieves Busted 7 Members Arrested : ఇతర రాష్ట్రాల నుంచి కొనే కార్ల రవాణా శాఖ ఇచ్చే నిరభ్యంతర పత్రం తప్పనిసరి. నిందితులు కారు అమ్మే సమయంలో రూ.2 లక్షల వరకూ తక్కువ తీసుకుంటారు. ఎన్‌వోసీ వచ్చేందుకు రెండు నెలల సమయం పడుతుందని.. అది వచ్చాక మిగిలిన సొమ్ము తీసుకుంటామని నమ్మిస్తారు. ఆ తర్వాత స్పందించరు. డబ్బులు మిగిలాయనే ఆతృతతో కొనుగోలు చేసిన వ్యక్తులు ఎన్‌వోసీ అడగడం లేదు. ఇదే అదనుగా బప్పాఘోశ్ తన ముఠా సభ్యులతో హైదరాబాద్‌లోనే కనీసం వంద కార్లు విక్రయించి ఉంటాడని పోలీసులు తెలిపారు.