కరోనాతో అంతటా నష్టాలే. అన్నిరంగాలూ ప్రభావితమైనవే. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా వైద్యరంగంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. వైద్య సిబ్బంది పూర్తిగా కొవిడ్ చికిత్సకే అంకితమయ్యారు. ఫలితంగా..పలు కీలక వైద్య సేవలు అందించలేకపోయారు. మొత్తం 25 రకాల వైద్య సేవలుండగా అందులో సగం వరకు నిలిచిపోయాయి. 105 దేశాల్లో చేపట్టిన సర్వే ఆధారంగా తక్కువ, మధ్య స్థాయి ఆదాయ దేశాల్లో ఆరోగ్య వ్యవస్థపై కరోనా సంక్షోభం తీవ్ర ప్రభావం చూపినట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది. కరోనా ప్రబలినప్పటి నుంచి ఇతర వైద్యసేవల్లో తీవ్రమైన అంతరాయం ఏర్పడిందని 70% దేశాలు అంగీకరించినట్లు డబ్ల్యూహెచ్వో స్పష్టం చేసింది. పిల్లల్లో రోగనిరోధక శక్తి పెంపొందించే వ్యాక్సిన్ సేవలు 70%మేర నిలిచిపోగా... సాంక్రమికేతర వ్యాధుల డయాగ్నసిస్, చికిత్సపై 69% మేర ప్రభావం పడింది.
కుటుంబ నియంత్రణ సేవలపై 68%, మానసిక వైద్య సేవలపై 61%, క్యాన్సర్ డయాగ్నసిస్, చికిత్సపై 55% మేర ప్రతికూల ప్రభావం చూపించింది...కరోనా. ప్రపంచ దేశాలు సాంక్రమికేతర వ్యాధుల నియంత్రణ విషయంలో ఎంతమేర సమర్థంగా ఉన్నాయని డబ్ల్యూహెచ్వో తరచు సమీక్షిస్తూ ఉంటుంది. 2001 నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతమూ అదేరీతిలో సర్వే చేయగా... 94% దేశాలు పూర్తిగా కరోనాను అడ్డుకోవటంలోనే నిమగ్నమయ్యాయని తేలింది. మామూలుగా అయితే...ఈ వైద్య సేవలు నిలిచిపోవటాన్ని 2రకాలుగా విభజించి చూస్తుంది డబ్ల్యూహెచ్వో. 5-50% మధ్యలో అంతరాయం కలిగితే అది పాక్షికంగానూ...50%కి మించే ఇబ్బంది ఏర్పడితే అది తీవ్రంగా పరిగణిస్తుంది. ఇలా చూస్తే...ప్రస్తుతం నమోదైన గణాంకాలు వైద్య సేవల అంతరాయం విషయంలో తీవ్రతనే సూచిస్తున్నాయి.
పలు దేశాల్లో మలేరియా నిర్థరణ, చికిత్సపై 46%, టీబీ చికిత్సపై 42%, యాంటీ వైరల్ చికిత్సలపై 32% మేర ప్రభావం పడింది. చాలాచోట్ల డెంటల్ కేర్ వైద్య సేవలూ నిలిచి పోయాయి. ఫలితంగా...ఆయా రోగులపై దీర్ఘకాలిక ప్రభావం ఉండే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. పావు వంతు దేశాల్లో ప్రాణాలు రక్షించే అత్యవసర వైద్య సేవలూ నిలిచి పోయాయి. 22% దేశాల్లో 24 గంటల పాటు అందుబాటులో ఉండాల్సిన సేవలకు అంతరాయం తప్పలేదు. 23% దేశాల్లో...అవసరమైన సమయాల్లో రక్తం సేకరించి అందించే విభాగాలు పని చేయలేదు. ఇక 19% దేశాల్లో అత్యవసర శస్త్రచికిత్సలూ నిలిపివేశారు. ప్రస్తుతానికి ఈ దేశాల్లో అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకోసం డబ్ల్యూహెచ్వో సూచనలు పరిగణనలోకి తీసుకుంటున్నారు.
అల్ప, మధ్యాదాయ వర్గాల ప్రజలు కరోనా కారణంగా ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వీరిని దృష్టిలో ఉంచుకునే...డబ్ల్యూహెచ్వో అన్ని దేశాలకూ కొన్ని సూచనలు చేసింది. నిర్ణీత ఆసుపత్రుల్లో రుసుము తీసుకోకుండా వైద్యం అందించే ఏర్పాట్లు చేయాలని తెలిపింది. అయితే... కేవలం 14% దేశాలే...ఈ నిబంధన అమలు చేస్తున్నాయి. మిగతా చోట్ల మునుపటి పరిస్థితులే ఉండటం వల్ల సామాన్య ప్రజలు ఆసుపత్రులవైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఈ పరిణామాలు గమనించిన డబ్ల్యూహెచ్వో... వైరస్ ప్రభావిత దేశాలు ఇతరత్రా సేవలు పునరుద్ధరించేందుకు మద్దతుగా నిలుస్తోంది. ఇందుకోసం సలహాలు సూచనలు ఇచ్చేలా ఆరోగ్య సేవలకు సంబంధించి శిక్షణా హబ్ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. అంతర్జాతీయంగా వచ్చే స్పందనల ఆధారంగా కార్యాచరణకు రూపకల్పన చేయాలని భావిస్తోంది.