దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వస్తున్న విప్లవంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రజల ముంగిటికి వస్తోంది. మొబైల్ వాడకందార్లతో పాటు ఇంటర్నెట్ వాడకం కూడా దేశంలో అనూహ్యంగా పెరుగుతోంది. తక్కువ ధరలకే స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడం, తక్కువ ధరకే డేటా లభ్యం కావడంతో ఇంటర్నెట్ వాడకం శరవేగంగా విస్తరిస్తోంది. పల్లె, పట్టణాలు, నగరాలు అన్న తేడా లేకుండా ఇంటర్నెట్ వినియోగం ఏటికేడు పెరిగిపోతోంది.
రెండో స్థానంలో మనదేశం
2019 నాటికి దాదాపు 142 కోట్లు జనాభా ఉన్న చైనా.. 82.90 కోట్లు మంది ఇంటర్నెట్ వాడకందార్లతో ప్రపంచంలో మొదటి స్థానం ఉండగా, దాదాపు 136 కోట్లు జనాభా కలిగిన భారత్ దేశం 56 కోట్లు మంది ఇంటర్నెట్ వినియోగదారులతో రెండో స్థానంలో నిలిచింది. భారత దేశంలో ఇంటర్నెట్ వాడకంపై ఇటీవల ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా-ఐఎఎంఏఐ సర్వే నిర్వహించింది. అప్పుడప్పుడు ఇంటర్నెట్ వాడుతున్న వారిని కాకుండా రెగ్యులర్ వాడకందార్లపై 2019 జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలలపాటు ఆ సంస్థ సర్వే నిర్వహించింది. గడచిన అయిదేళ్లుగా ఇంటర్నెట్ వాడుతున్నవారి సంఖ్య 45.10 కోట్లుకాగా 12 సంవత్సరాలు వయస్సు పైబడిన వారు 38.5 కోట్లు, 5 నుంచి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు 6.6 కోట్లుగా వెల్లడించింది. 12 సంవత్సరాలు వయస్సు పైబడిన ఇంటర్నెట్ వాడకందార్లు దేశ జనాభాలో 36శాతంకాగా అర్బన్‌లో 51శాతం, గ్రామీణంలో 27శాతం ఉన్నారు. దేశంలోని ఎనిమిది మెట్రో నగరాల్లో మొత్తం వినియోగదారుల్లో 63శాతం మంది ఉన్నట్లు సర్వే ద్వారా వెల్లడైంది. మెట్రో నగరాల వారీగా వాడకందార్ల సంఖ్యను పరిశీలించినట్లయితే కోటి 17లక్షల మందితో ముంబయి మొదటి స్థానంలో ఉండగా కోటి 12 లక్షలతో దేశ రాజధాని దిల్లీ రెండో స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానాల్లో వరుసగా 61లక్షలతో బెంగుళూరు, కోల్‌కతాలు, 54లక్షలతో చెన్నై, 42లక్షలతో హైదరాబాద్, 39లక్షలతో అహ్మదాబాద్, 36లక్షలతో పుణెలు నిలిచాయి.
పురుషులే ఎక్కువ