Womens Day Celebrations 2023 : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా.. మహిళల సన్మానాలతో సంబరాలు అంబరాన్నంటాయి. వేదికలన్నీ స్త్రీ శక్తి ఘనతను చాటుతూ మారుమోగాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు సహా అన్ని రాజకీయ పార్టీల నేతలు.. మహిళా దినోత్సవాల్లో పాల్గొన్నాయి.
వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలంయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సత్యవతి రాఠోడ్... వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించిన 27మంది మహిళలను ఘనంగా సన్మానించి... ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున బహుమతులు అందజేశారు. విద్యార్థినుల కేరింతలతో ఆడిటోరియం మారుమోగింది. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌లో జరిగిన వేడుకల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సందడి చేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడిన ఆమె... స్త్రీలు ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కుంటూ ముందుకు సాగాలని హితవు పలికారు. కరీంనగర్‌లో స్త్రీ శక్తిని చాటుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళా సంఘాలకు 9కోట్ల రూపాయల వడ్డీలేని రుణాలను అందజేశారు. భువనగిరి మండలం గూడూరులో పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగి చీర అందజేశారు.
గ్రేటర్ హైదరాబాద్ సహా... సూర్యాపేట, భువనగిరి, కరీంనగర్, భద్రాద్రి, ఆదిలాబాద్ జిల్లాల్లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలకు... స్థానిక ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సమాజ అభివృద్ధిలో... వనితల పాత్రలను ప్రశంసించారు. వినూత్న కార్యక్రమాలతో బీఆర్ఎస్ న్యూట్రిషన్ పాలిటిక్స్ చేస్తుంటే... మతాల పేరుతో భాజపా పార్టిషన్ పాలిటిక్స్ చేస్తోందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆరోగ్య మహిళా కార్యక్రమానికి కరీంనగర్‌లో ఆయన శ్రీకారం చుట్టారు. మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి, ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం కరీంనగర్‌లో జరిగిన మహిళా దినోత్సవంలో పాల్గొన్న మంత్రి.... అతివల ఆరోగ్యం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళ, న్యూట్రిషన్ కిట్‌తో పాటు వడ్డీలేని రుణాలను ఖాతాల్లో జమా చేస్తున్నట్లు వివరించారు.