internal disputes in congress : కాంగ్రెస్ పార్టీ సీనియర్ల మధ్య అంతర్గత విబేధాలు ముదిరి పాకానపడుతున్నాయి. సీనియర్లలో సఖ్యత లేకపోవడం శ్రేణుల్లో నైరాశ్యానికి దారితీస్తోంది. కొత్త ఏడాదిలోనైనా అసంతృప్తి స్వరాల తీరు మారాలంటూ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ చిన్నారెడ్డి విజ్ఞప్తి చేసినా.. పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. రేవంత్‌రెడ్డి తీరును ముందు నుంచీ తప్పుపడుతున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. సోనియాకు ఫిర్యాదు చేస్తూ లేఖ రాయడం .. విషయం బయటకు వెల్లడి కావడం కలకలం రేపింది. తనను తప్పుపట్టడంతో పాటు కాంగ్రెస్ పార్టీలో నిబద్ధత కలిగిన నేతలపైనా వ్యవహరిస్తున్న తీరుపై జగ్గారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలోంచి పంపించే కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల్లోకి వెళ్తే తలెత్తుకోలేక పోతున్నాం
కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై లింగోజిగూడ కార్పొరేటర్ రాజశేఖర్‌రెడ్డి గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టిమరీ ఐక్యంగా ఉండాలని సీనియర్లకు హితవు పలకడం పరిస్థితికి అద్దం పడుతోంది. 23 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను నాలుగు సార్లు పోటీ చేసి ఒకసారి గెలిచానని.. ప్రజల్లోకి వెళ్తే సీనియర్ల మధ్య విబేధాలతో తలెత్తుకోలేక పోతున్నామని గాంధీభవన్‌లో మీడియా ముందే వెల్లడించడం నేతలను ఆలోచనలో పడేస్తోంది.
ముందు నుంచి అదే చెబుతున్న వీహెచ్..
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతర్గత విబేధాలు కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం అందరినీ కలుపుకొని వెళ్లాలని ముందునుంచి చెబుతున్న వీహెచ్.. గొడవలు సద్ధుమణిగేలా తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిసిన హన్మంతరావు.. ఇవాళ జగ్గారెడ్డితో భేటీ అవడం ప్రాధాన్యం సంతరించుకుంది.