Internal disputes in BRS: పలు జిల్లాల్లో నేతల అంతర్గత విభేదాలు బీఆర్ఎస్కు తలనొప్పిగా మారాయి. నామినేటెడ్ పదవులు సహా ఇతర అంశాలు మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా భారాసలో ముసలం పుట్టించాయి. మంత్రి మల్లారెడ్డిపై జిల్లా శాసనసభ్యులు తమ అసంతృప్తి బాహాటంగానే ప్రకటించారు. జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు సమావేశమై మంత్రి వైఖరి, తమకు, తమ నియోజకవర్గాలకు జరుగుతున్న అన్యాయంపై సుధీర్ఘంగా చర్చించారు. దూలపల్లిలోని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నివాసం భేటీకి వేదికైంది.
మైనంపల్లితోపాటు ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి శాసనసభ్యులు సుభాష్ రెడ్డి, వివేకానంద గౌడ్, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ సమావేశంలో పాల్గొన్నారు. తాజాగా మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి నియామకంపై వివాదం రాజుకొంది. కారణాలేవైనా పార్టీ అధికారంలోకి వచ్చాక ఇలా ఎమ్మెల్యేలు.. సామూహికంగా ఓ మంత్రిపై అసమ్మతిని వ్యక్తం చేయడం ఇదే ప్రథమం. జాతీయ పార్టీగా బీఆర్ఎస్ అవతరించిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడంపై అధిష్ఠానం ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రోటోకాల్ వివాదాలు: వాస్తవానికి ఇలాంటి పరిస్థితి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంత్రులకు, ఎమ్మెల్యేలకు మధ్య పార్టీ ఆశించిన స్థాయిలో సఖ్యత లేదు. ఎంపీలు, ఎమ్మెల్సీలు కొన్నిచోట్ల అసంతృప్తిని వెళ్లగక్కుతున్న ఉదంతాలున్నాయి. పలు సందర్భాల్లో ప్రొటోకాల్‌పరమైన సమస్యలూ నేతల మధ్య పొరపొచ్చాలకు కారణమవుతున్నాయి. ఉదాహరణకు సెప్టెంబరులో పాలేరు రిజర్వాయర్ వద్ద చేప పిల్లల విడుదల కార్యక్రమంలో ప్లెక్సీల వ్యవహారం స్థానిక నాయకుల మధ్య కలహాలను బయటపెట్టింది. పోలీసు అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చే విషయంలో ప్రభుత్వం నేతల సిఫార్సులను పరిగణనలోనికి తీసుకుంటోంది.
అయితే పోలీసు కమిషనర్లు, ఎస్పీల విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం రావడం లేదు. ఖమ్మం జిల్లాలో గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పదవిని అధిష్ఠానం ఓ ఎమ్మెల్యే సన్నిహితునికి ఇవ్వగా, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఇతర నేతలు అసంతృప్తితో ఆయన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరుకాలేదు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఆ జిల్లా ఎమ్మెల్యేలకు మధ్య సఖ్యత లేని కారణంగా నిజామాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సహా ఆ జిల్లాలోని ఇతర నియామకాల విషయంలో జాప్యం జరుగుతోందనే ఆరోపణలున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో మంత్రి సత్యవతి రాఠోడ్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మధ్య తరచూ భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మహబూబాబాద్‌లో పరిస్థితి:డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మంత్రిని ఖాతరుచేయడం లేదనే ఆరోపణలున్నాయి. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత కూడా కొన్ని అంశాల్లో మంత్రిపై అంతర్గతంగా విమర్శలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు మంత్రి సబితారెడ్డికి దూరంగా ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఆమెపై బహిరంగంగానే విమర్శలు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రుల నియోజకవర్గాలకు నిధుల కేటాయింపు అధికంగా ఉండటం, అభివృద్ధి పనులు భారీగా జరగడంపై స్థానిక ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది.