Internal Conflicts in Khammam BRS Party : రాష్ట్రవ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి(BRS)కి బ్రహ్మరథం పట్టినా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చేదు ఫలితాలను చవిచూసింది. 2014లో కొత్తగూడెం, 2018లో ఖమ్మం అసెంబ్లీ స్థానాలు(Khammam Assembly Seats) మాత్రమే గెలుచుకుని ఒక్క స్థానానికి పరిమితమైంది. దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి అత్యధిక స్థానాలు గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాపైనే దృష్టి సారిస్తానని స్వయంగా సీఎం కేసీఆర్(CM KCR).. జిల్లా నేతలకు పలుమార్లు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలం 8కి చేరింది. ఇదే సమయంలో ఎన్నికల సమీపిస్తున్న కొద్ది కారు పార్టీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
Khammam BRS Leaders Fight : ముఖ్యనేతల్లో ఒకరైన పొంగులేటి ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరగా.. రేపో మాపో, పార్టీ మారేందుకు రాజకీయ దిగ్గజం తుమ్మల సిద్ధమవుతున్నారు. ఓ వైపు ఇన్ని పరిణామాలు సాగుతున్నా.. గులాబీ నేతల్లో సమన్వయ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. అభ్యర్థుల ప్రకటన తర్వాత పలు జిల్లాల్లో ఎన్నికల సన్నాహక కార్యక్రమాలు, నియోజకవర్గాల వారీగా సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ముఖ్య నేతలంతా వారి నియోజకవర్గాలకే పరిమితం అవ్వటంతో ఎవరికే వారే యమునా తీరే అన్నట్లుగా ఉంది. ఈ పరిణామంతో పార్టీ శ్రేణుల్లో కొంత స్తబ్ధత కనిపిస్తోంది.
వ్యక్తిగత విభేదాలు వీడి కలిసి పనిచేయండి... ఖమ్మం బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం
Internal Clashes in Khammam BRS Party : ఇప్పటికే వలసలతో ఇబ్బంది పడుతున్న గులాబీ పార్టీకి ఇటీవల ప్రకటించిన ఎన్నికల సమన్వయకర్తల నియామకం అగ్గి రాజేస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అసెంబ్లీ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ ఇంఛార్జీలను నియమించింది. అయితే పలు చోట్ల ఇంఛార్జీలు అవసరం లేదని అంటుండగా భద్రాచలం ఇంఛార్జీని తొలగించి గతంలో ఉన్న నాయకుడికే ఇవ్వాలని అక్కడి నేతలు పట్టుపడుతుండటంతో అక్కడ నిర్వహించాల్సిన సన్నాహక సమావేశం వాయిదా పడింది. కొత్తగూడెం ఇంఛార్జీ వద్దిరాజు రవిచంద్ర నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఎంపీ నామా, ఎమ్మెల్సీ తాతా మధుసూధన్, రేగా కాంతారావు గైర్హాజరవటం చర్చనీయాంశంగా మారింది.