High Court On Electricity Dues Dispute Between Two States: విద్యుత్ బకాయిల వివాదంపై తెలంగాణపై తీవ్రమైన, బలవంతపు చర్యలకు దిగవద్దని కేంద్రాన్ని, ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ వాదన వినకుండానే ఏపీకి 7వేల కోట్ల రూపాయలు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వలు ఇవ్వడం సమంజసం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. పూర్తిస్థాయి విచారణ చేపడతామన్న ఉన్నత న్యాయస్థానం.. కౌంటర్లు దాఖలు చేయాలని ఇరు రాష్ట్రాల విద్యుత్ సంస్థలను ఆదేశించింది.
ఏపీ విద్యుత్ సంస్థలకు 7వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలన్న కేంద్ర విద్యుత్ శాఖ ఉత్తర్వులపై తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ పి. నవీన్ రావు, జస్టిస్ సాంబశివనాయుడు ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే, ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి, కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్ రెడ్డి వాదనలు వినిపించారు.
పునర్విభజన చట్టం ప్రకారం దక్షిణ ప్రాంతీయ మండలి చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని.. కేంద్రానికి అధికారం లేదని తెలంగాణ వాదించింది. పునర్విభజన వివాదాలపై కూడా నిర్ణయాధికారం కేంద్ర హోం శాఖకు ఉండగా.. కేంద్ర విద్యుత్ శాఖలో డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారి ఉత్తర్వులు ఎలా ఇస్తారని వాదించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీలో అధికార పార్టీ సహకరించినందుకే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చారని దుశ్యంత్ దవే వాదించారు.
అయితే రాష్ట్ర విభజన తర్వాత సరఫరా చేసిన విద్యుత్ బిల్లుల అంశానికి పునర్విభజన చట్టం సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ వాదించింది. ఏపీ జెన్కో విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత తెలంగాణ సంస్థలకు ఉందని సీవీ మోహన్ రెడ్డి వాదించారు. అప్పులు తీసుకుని విద్యుత్ ఉత్తత్తి చేశామని బిల్లులు చెల్లించకపోతే తాము తీవ్రంగా నష్టపోతామని ఏపీ వాదించింది. దక్షిణ ప్రాంతీయ మండలికి చట్టబద్ధత లేదని.. అయినప్పటికీ అక్కడ విచారణకు ఎలాంటి ఫలితం రాలేదన్నారు.
కేంద్ర విద్యుత్ శాఖ జోక్యంతోనే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ సరఫరా చేసినందున బిల్లుల బకాయిల విషయంలో జోక్యం చేసుకొని అధికారం తమకు ఉంటుందని కేంద్రం వాదించింది. అన్ని వాదనలు విన్న హైకోర్టు పూర్తిస్థాయి విచారణ కోసం కౌంటర్లు దాఖలు చేయాలని తెలంగాణ, ఏపీ విద్యుత్ సంస్థలను ఆదేశించింది. అప్పటి వరకు తెలంగాణపై కఠినమైన చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ వివరణ, వాదన వినకుండానే కేంద్రం ఉత్తర్వులు ఇవ్వడం చట్టవిరుద్ధంగా కనిపిస్తోందని ధర్మాసనం అభిప్రాయపడింది. పిటిషన్‌పై తదుపరి విచారణను అక్టోబరు 18కి వాయిదా వేసింది.
అసలేెం జరిగిదంటే: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రం చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపై కేంద్ర విద్యుత్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రం బకాయిపడ్డ రూ.3,441 కోట్లు ప్రిన్సిపల్ అమౌంట్ ను, రూ.3,315 కోట్ల లేట్ పేమెంట్ సర్ చార్జీ చెల్లించాలని పేర్కొంది. ఆ బకాయిలను తెలంగాణ రాష్ట్రం 30రోజుల్లోగా చెల్లించాలని కేంద్ర విద్యుత్ శాఖ స్పష్టం చేసింది. 2014-17 వరకు తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలకు (డిస్కంలకు) సంబంధించిన విద్యుత్ సరఫరా బకాయిలుగా కేంద్రం వెల్లడించింది.
ఇవీ చదవండి:తెలంగాణకు కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలు
చేనేత కార్మికులకు కేంద్రప్రభుత్వం ఏం చేసింది?: హరీశ్‌రావు
తొలి దేశీయ పిస్తోల్.. సైన్యం కోసం అసాల్ట్ రైఫిల్.. యువకుడి ఇండియన్ వెపన్స్!