Love breakup story: ఆరోజు ఆఫీసు క్యాంటీన్లో టీ తాగుతున్నా. నా ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తోందో సౌందర్యం. ఆమెని చూడగానే మనసు జివ్వుమంది. మళ్లీమళ్లీ చూడమని మారాం చేసింది. ‘ఇదేమైనా లవ్ ఎట్ ఫస్ట్ సైటా?’ అన్నాడు ఆత్మారాముడు. ‘లవ్వా.. గివ్వా.. అమ్మాయి బాగుంది చూశానంతే..’ నాకు నేనే సర్దిచెప్పుకున్నా. ఆమె ఎదురు పడ్డప్పుడల్లా నిగ్రహ పూజారిలా మనసులోనే మంత్రాలు జపించేవాడిని. అవి తనకు వినిపించాయేమో.. ఎటు వెళ్లినా ప్రత్యక్షమవుతూ నన్ను పరీక్షించేది. ఆమె కనబడినప్పుడల్లా ఆత్మారాముడు లోలోపల డ్యాన్స్ చేస్తుంటే.. ఏంటిలా అయిపోతున్నావంటూ నిగ్రహ రాముడు హెచ్చరించేవాడు. ఇద్దరికీ నిత్యం యుద్ధమే.
రోజులు గడుస్తున్నకొద్దీ నా నిగ్రహం సడలింది. ఆఖరికి.. ఆమె కనిపించకపోతే విలవిల్లాడే స్థితికి వచ్చా. ఓసారి తను ఆఫీసులో హాజరు వేస్తుంటే ఐడీ కార్డు చూశా. పేరు తెలిశాక అంబారీ ఎక్కినంత సంబరం. నక్షత్రాల్లా తన చుట్టూ ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నా చందమామలా వెలిగిపోయేది. ముఖానికి కొద్దిగా పౌడరు.. మృదువైన పెదాలపై లిప్‌స్టిక్.. నుదుటిన చిన్న బొట్టుబిళ్ల.. అంతే తన మేకప్. ఆ సహజ సౌందర్యరాశి నాకు దక్కుతుందా అనే సంశయం మొదలైంది కొన్నాళ్లకు. ఫర్వాలేదు.. గట్టిగా ప్రయత్నిస్తే.. అనుకున్నది జరుగుతుంది అనుకునేవాణ్ని. అదే జరిగితే నీలి నీలి ఆకాశం దోసిళ్లలో తెచ్చి తనకి ఇవ్వాలనుకున్నా.
రోజులు నెలలవుతున్నాయి. నాకు నేను ఆమెతో డ్యూయెట్లు పాడుకోవడం తప్ప.. నోరు విప్పి తనతో మాట్లాడింది లేదు. మరి నా తీయని బాధ ఆమెని చేరేదెలా? అసలు నేను తనని ఫాలో అవుతున్న సంగతి ఆమెకి తెలుసా? ఎన్నాళ్లీ వేదన? ప్రశ్నలతో బుర్ర వేడెక్కేది. హనుమంతుడికి తన బలం గుర్తు చేశాకే.. అవలీలగా సాగరం దాటాడట రామాయణంలో. అలా నా ప్రేమ సాగరాన్ని ఈది తనని చేరడానికి ఎవరైనా సాయం చేస్తే బాగుండు అనిపించేది. కానీ నేను అందరికీ పరాయినేనాయే! అయినా ఏదో నాకు తోచినట్టుగా ప్రయత్నించేవాణ్ని. తన స్వరం వినడం కోసం పక్కపక్కనే నడుచుకుంటూ వెళ్లడం.. ఒక్కోసారి కావాలనే ఎదురు పడటం.. తన చూపులు నన్ను చేరగానే తల చప్పున కిందికి వేలాడేసుకోవడం.