Inter students will be charged for late fee payment: ప్రైవేటు కళాశాలల నిర్లక్ష్యం.. ప్రభుత్వ నిర్ణయంలో అలసత్వంతో ఇంటర్ విద్యార్థులకు శాపంగా మారింది. గృహ, వాణిజ్య సముదాయాల్లో కొనసాగుతున్న కళాశాలలు అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర ధ్రువపత్రం(ఎన్‌ఓసీ) పొందకుండా ఈసారికి మినహాయింపు ఇవ్వాలని నెలలుగా కోరుతున్నాయి.. నిర్ణయంపై నాన్చుడుధోరణితో ఉన్న ప్రభుత్వం చివరకు విద్యార్థులు పరీక్షఫీజు కట్టే గడువు ముగిశాక మినహాయింపునకు అనుమతి ఇవ్వడంతో విద్యార్థులపై రూ.15 కోట్ల వరకు అదనపు భారం పడుతోంది.
డిసెంబరు 22 నుంచి ఆలస్య రుసుం:గృహ, వాణిజ్య సముదాయాల్లో కొనసాగుతున్న ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు భవనం ఎత్తుతో సంబంధం లేకుండా అగ్నిమాపక శాఖ ఎన్‌ఓసీ తప్పనిసరి. ఆ మేరకు 2020 సెప్టెంబరు 24న హోం శాఖ జీఓ 29 జారీ చేసింది. ఎన్‌ఓసీ సమర్పిస్తేనే బోర్డు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) జారీచేస్తుంది. అప్పుడే విద్యార్థులు వార్షిక పరీక్షల ఫీజు చెల్లించడానికి వీలవుతుంది. లేకుంటే ఆ కళాశాలలకు బోర్డు వెబ్‌సైట్ లాగిన్ కాదు. కరోనా నేపథ్యంలో 2020-21, 2021-22 విద్యా సంవత్సరాలకు ఆ జీఓ అమలులో మినహాయింపు ఇచ్చారు. మరో రెండేళ్లపాటు జీఓ 29ని అమలు చేయవద్దని ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాల సంఘం ప్రభుత్వానికి ఆరేడు నెలల నుంచి విన్నవిస్తూ వచ్చింది. చివరకు ప్రస్తుత విద్యా సంవత్సరంతో పాటు వచ్చే ఏడాది (2023-24)కి కూడా జీఓ 29 అమలు నిలిపివేస్తూ డిసెంబరు 23న ప్రభుత్వం జీఓ 72 జారీ చేసింది.