ఇంటర్ ఫలితాల అవకతవకల బాధ్యులపై చర్యలు తీసుకోండి ఇంటర్ ఫలితాల్లో తప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల ఆత్మశాంతి కోసం జూన్ రెండో తేదీన సికింద్రాబాద్ గాంధీ విగ్రహం వద్ద మౌనదీక్ష నిర్వహించనున్నట్లు బాధిత కుటుంబాలు తెలిపాయి. సచివాలయంలో వివిధ పార్టీల ప్రతినిధులు, బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కలిసేందుకు వచ్చారు. ముఖ్యమంత్రితో సమావేశం కారణంగా సీఎస్ అందుబాటులో లేకపోవడం వల్ల ఆయన కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు.
ప్రతిభా వంతులకు అన్యాయం
అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులకు అన్యాయం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరి వల్లే తమ పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి, మంత్రులు కనీసం పరామర్శించలేదని వాపోయారు. వీరికి కాంగ్రెస్, సీపీఐ నేతలు సంఘీభావం తెలిపారు. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం సమీక్ష