Inter Student Committed Suicide: ప్రస్తుత రోజుల్లో చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరి జీవితం సెల్‌ఫోన్ చుట్టూ తిరుగుతోంది. ఈ క్రమంలోనే పిల్లలపై మొబైల్స్ ప్రభావం ఎంతగా పడింది అంటే.. అవి లేకుండా ఉండలేనంతగా మారింది. తలిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం వారికి ఫోన్ ఇస్తే వారు మాత్రం ఇతర అవసరాల కోసం చరవాణిని ఉపయోగిస్తున్నారు. తద్వారా బంగారు లాంటి భవిష్యత్తును పక్కనపెట్టి... సెల్‌ఫోన్స్‌కు బానిసలుగా మారుతున్నారు. మొదట తల్లిదండ్రులు వారిపై దృష్టిపెట్టక పోయేసరికి.. వారు పూర్తిగా సెల్‌ఫోన్ బానిసలుగా మారుతున్నారు.
ఇదే విషయాన్ని తల్లిదండ్రులు గమనించి ప్రశ్నిస్తే కొందరు అసహనానికి గురవుతున్నారు. మరికొందరు క్షణికావేశంలో తమ బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్బీఐ కాలనీలో నివాసం ఉంటున్న ధ్రువ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెంకడియర్ చదువుతున్నాడు.
ఈ క్రమంలోనే సదరు విద్యార్థి సెల్‌ఫోన్ గేమ్స్ ఆడేందుకు ఎక్కువగా అలవాటు పడ్డాడు. దీనిని గమనించిన తల్లిందండ్రులు పలుమార్లు వద్దని వారించారు. అయినా వినకుండా ధ్రువ అలాగే గేమ్స్‌కు బానిసగా మారాడు. దీంతో తల్లిదండ్రులు మరోసారి మందలించారు. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన ధ్రువ తను నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌పై నుంచి కిందికి దూకేశాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించేలోగా అప్పటికే మృతి చెందాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. అయితే తమ కుమారుడి మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు మృతుడి తల్లిదండ్రులు తెలిపారు.
గత 20 రోజుల్లోనే నలుగురు విద్యార్థుల ఆత్మహత్యలు:మరోవైపు రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. గత 20 రోజుల్లోనే నలుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం వ్యవస్థలోని లోపాలకు కారణంగా మారింది. ఇటీవల వరంగల్‌లో సీనియర్ వేధింపులు భరించలేక వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య చేసుకుంది. తన వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని స్నేహితుడు వేధించడంలో నర్సంపేటకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. నిన్న శ్రీ చైతన్య కళాశాల విద్యార్థి సాత్విక్ ప్రిన్సిపల్, వార్డెన్, అధ్యాపకులు వేధిస్తున్నాడని ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.