రాష్ట్రంలో (telangana intermediate board)ఇంటర్ వార్షిక పరీక్షలు మరో నాలుగు నెలల్లో జరుగుతాయి. ప్రవేశాల గడువూ ఈ నెల 12తో ముగిసింది. అయినా ఈ విద్యా సంవత్సరం ఎంత మంది చేరారు? ఏ విద్యార్థి ఏ కళాశాలలో చేరారో ఇంటర్‌బోర్డుకు(intermediate board) తెలియని పరిస్థితి. ప్రైవేట్ కళాశాలలకు అనుమతుల జారీ పూర్తి చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది.
ఈ ఏడాది 1570 ప్రైవేట్ కళాశాలలు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్)నకు దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటివరకు 1269 కళాశాలలకు అనుమతి దక్కింది. మిగిలిన 301 కళాశాలలకు అనుమతిపై ఇంటర్‌బోర్డు(intermediate board) తాత్సారం చేస్తోంది. ఈ కళాశాలల్లో దాదాపు 70 వేల మంది ప్రవేశాలు పొందారు. ఇవన్నీ వాణిజ్య, గృహ సముదాయాల్లో (మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ) నడుస్తున్నాయి. నిబంధనల ప్రకారం వాటికి అగ్నిమాపకశాఖ నుంచి నిరభ్యంతర ధ్రువపత్రం(ఎన్‌ఓసీ) అవసరం. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ విద్యా సంవత్సరానికి ఎన్‌ఓసీ నుంచి అగ్నిమాపకశాఖ మినహాయింపు ఇచ్చింది. దానిపై గత నెల 5న జీఓ 95 జారీ చేసింది. ఈ ఉత్తర్వు ఇచ్చి 40 రోజులు దాటినా ఇంకా ఈ కళాశాలలు అనుబంధ గుర్తింపునకు నోచుకోలేదు.