ఈనెల 25 నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు (Inter 1st year exams 2021) పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra Reddy) వెల్లడించారు. ఇవాళ వివిధ శాఖల అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ (Sabitha Indra Reddy Video Conferance) నిర్వహించారు. గతంలో కరోనా పరిస్థితుల వల్ల ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను రెండో సంవత్సరానికి ప్రమోట్ చేశామని.. అయితే పరిస్థితులు అనుకూలించినప్పుడు పరీక్షలు నిర్వహిస్తామని ముందే చెప్పామని మంత్రి వివరించారు.
ఇంటరే టర్నింగ్ పాయింట్...
విద్యార్థుల భవిష్యత్తుకు ఇంటర్మీడియట్ టర్నింగ్ పాయింట్ కాబట్టి... పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 58వేల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు మంత్రి తెలిపారు. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పరీక్ష కేంద్రాలను 1,400 నుంచి 1,750కి పెంచినట్లు సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కొన్ని పాఠశాలల్లోనూ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కొవిడ్ టీకాలు వేసుకున్న 25వేల మంది ఇన్విజిలేటర్లు విధుల్లో ఉంటారన్నారు.
గంట ముందు నుంచే...
గంట ముందు నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి (Inter 1st year exams 2021) అనుమతిస్తామని.. ముందు జాగ్రత్తగా కేంద్రంలో ఓ ఐసోలేషన్ గదిని సిద్ధంగా ఉంచుతామని, మాస్కులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. మంచినీరు, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేస్తున్నాని.. ప్రతీ జిల్లాలో సమన్వయ, పర్యవేక్షణ, హైపవర్ కమిటీలు ఉంటాయన్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలకు సిద్ధం కావాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. ప్రశ్నల్లో ఎక్కువగా ఛాయిస్ ఉంటాయని... స్టడీ మెటీరియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉందన్నారు.