ఇంటర్ నుంచే కామర్స్ సబ్జెక్టుకు ప్రాధాన్యమిస్తే విద్యార్థులకు అధిక ప్రయోజనమని అధ్యాపకులు, నిపుణులు చెబుతున్నా ఇంటర్ బోర్డు పట్టించుకోవడం లేదు. కామర్స్ విభాగంలో సంప్రదాయ డిగ్రీ చదివినా కొలువులు దొరుకుతాయి. ఇతర ఏ సబ్జెక్టుకూ లేని ప్రత్యేకత అది.
వాణిజ్యశాస్త్రం విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు
ఎంపీసీ, బైపీసీ గ్రూపుల పాఠ్య ప్రణాళికను జాతీయ ప్రవేశ పరీక్షలకు అనుగుణంగా సీబీఎస్ఈతో పోటీగా రూపొందిస్తున్న బోర్డు, వాణిజ్యశాస్త్రం దగ్గరకు వచ్చే సరికి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలున్నాయి. డిమాండ్‌ను గుర్తించి సీబీఎస్ఈ, ఐసీఎస్సీ బోర్డులు కామర్స్ సబ్జెక్టును మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం కనీస సంస్కరణలు తీసుకురావడం లేదు.
విద్యార్థులకు ప్రయోజనం
నిపుణులు కమిటీని నియమించి సబ్జెక్టును మరింత బలోపేతం చేస్తే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని ఓయూ కామర్స్ విభాగం విశ్రాంత ఆచార్యుడు ఎస్వీ సత్యనారాయణ, గజ్వేల్ డిగ్రీ, పీజీ ప్రభుత్వ కళాశాల సహాయ ఆచార్యుడు గోపాల సుదర్శనం సూచిస్తున్నారు.