ప్రశ్న: కరోనా ప్రత్యేక పరిస్థితుల్లో ప్రారంభమైన ఇంటర్ విద్యా సంవత్సరం ఎలా కొనసాగుతోంది?
జవాబు: కరోనా పరిస్థితుల వల్ల నాలుగు నెలలు అంతరాయం కలిగింది. విద్యా సంవత్సరం నష్టపోవద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం అనుమతితో.. ఆన్లైన్ పాఠాలతో విద్యా సంవత్సరం ప్రారంభించాం. నిపుణులైన అధ్యాపకులతో దూరదర్శన్ ద్వారా బోధన జరుగుతోంది. మార్చి 24 నుంచి పరీక్షలు నిర్వహిస్తాం. సమయం తక్కువగా ఉంది కాబట్టి... 30 శాతం సిలబస్ కుదించి 70 శాతం బోధించాలని నిర్ణయించాం. రెగ్యులర్ తరగతులు కూడా ప్రారంభించి.. ఆన్లైన్, ఆఫ్‌లైన్ కలిపి సిలబస్ పూర్తి చేయాలనుకుంటున్నాం.
ప్రశ్న: కొవిడ్ తీవ్రత ఇంకా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కళాశాలలు తెరిచేందుకు ఎలా సిద్ధమవుతున్నారు?
జవాబు:అన్‌లాక్-4 ప్రకారం ఈనెలాఖరు వరకు విద్యా సంస్థలకు అనుమతి లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం విద్యా సంస్థలు తెరిచేందుకు అనుమతిస్తే.. ఇంటర్ కాలేజీలు ప్రారంభించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. భౌతిక దూరం పాటించడం కష్టం కాబట్టి షిఫ్టు పద్ధతిలో కాలేజీలు నిర్వహించాలని భావిస్తున్నాం. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు రెండో సంవత్సరం.. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదున్నర వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు కాలేజీలు నడిపేలా ప్రణాళికలు చేసుకుంటున్నాం. ఇంటర్ బోర్డు ప్రతిపాదనలకు ప్రభుత్వం అనుమతి కూడా తెలిపింది..
ప్రశ్న: ఏ ప్రాతిపదికన సిలబస్ కుదించారు. భవిష్యత్తులో జేఈఈ, నీట్ వంటి పరీక్షలు రాయడానికి ఇబ్బందులు తలెత్తవా?
జవాబు: ఈ విద్యా సంవత్సరం సుమారు నాలుగు నెలలు నష్టపోయినందున.. ప్రత్యేక పరిస్థితుల్లో 30శాతం సిలబస్ కుదించక తప్పడం లేదు. సిలబస్ తగ్గించేందుకు సైన్స్, హ్యుమానిటీస్‌కు రెండు వేర్వేరు ప్రాతిపదికలు తీసుకున్నాం. సైన్స్ గ్రూపులకు సీబీఎస్ఈని అనుసరించాం. సీబీఎస్ఈ తొలగించిన పాఠాలనే తగ్గించాం. సీబీఎస్ఈ కూడా తగ్గించింది కాబట్టి.. జేఈఈ, నీట్ వంటి జాతీయ పరీక్షలకు సమస్యే ఉండదు. తొలగించిన పాఠాల నుంచి ప్రశ్నలు రావు. హ్యుమానిటీస్‌లో సిలబస్ తగ్గించేందుకు యూనివర్సిటీ, డిగ్రీ, ఇంటర్ స్థాయి అధ్యాపకులు, సబ్జెక్టు నిపుణులతో కమిటీలు ఏర్పాటు చేశాం. వారు సూచించిన పాఠాలను తగ్గించాం. తొలగించిన పాఠాలను ఇవాళ లేదా రేపు ప్రకటిస్తాం.
ప్రశ్న: ఇంటర్లో తొలగించిన పాఠాలకు.. కొనసాగింపుగా డిగ్రీ, ఇంజినీరింగ్‌లో పాఠాలు ఉంటే.. విద్యార్థులకు ఇబ్బంది ఉండదా?
జవాబు: ప్రధాన పాఠాలను తొలగించలేదు. ఎక్కువగా అనుబంధ పాఠాలే కుదించాం. ఏదేమైనా ఇప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో అసాధారణ నిర్ణయం తీసుకోక తప్పడం లేదు. భవిష్యత్తులో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే.. సమయానుగుణంగా పరిష్కరించుకోవచ్చు.
ప్రశ్న: ప్రశ్నాపత్రం, పరీక్షల విధానంలో ఏమైనా మార్పులు ఉంటాయా?